అరటి పండు హల్వా త‌యారీ సుల‌భ‌మే

-

అబ్బ.. చెబుతుంటేనే నోరూరుతుందే.. అంటారా? అవును.. అరటి పండు హల్వాను ఒక్కసారి తిన్నారంటే ఇక మీరు వదలరు. మళ్లీ మళ్లీ తింటారు. నిజం. దీన్ని తయారు చేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదు.. సింపుల్ గా తయారు చేసుకొని లొట్టలేసుకుంటూ లాగించేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. పదండి అరటి పండు హల్వా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

ముందుగా మీరు ఏం చేయాలంటే దోరగా పండిన కొన్ని అరటి పళ్లు తీసుకోండి. మీకు ఎక్కువ హల్వా కావాలంటే ఎక్కువ అరటి పళ్లను తీసుకోండి. కొంచెమే కావాలంటే కొన్ని అరటి పళ్లనే తీసుకోండి. అరటి పళ్లను ముక్కలు ముక్కలుగా కోసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకోండి. స్టవ్ మీద పెట్టి అందులో ఇంత నెయ్యి వేయండి. వేశారా? ఆ నెయ్యిని కాసేపు వేగనీయండి. అందులో తరిగిపెట్టిన అరటి పళ్ల ముక్కలు వేయండి. దోరగా వేయించండి. ఆ గిన్నెను తీసి పక్కన పెట్టండి. అరటి పళ్ల ముక్కలు చల్లారేదాక ఆగండి. అవి చల్లారాక ఆ ముక్కలను మెత్తగా చేయితో పిసకండి.

ఆ మిశ్రమానికి ఇంత మైదాపిండి కలపండి. రెండు బాగా మిక్స్ అయ్యే దాక కలపండి. ఆ మిశ్రమంలో ఇంత నెయ్యి వేయండి. కావాల్సినంత చక్కెర వేయండి. కలపండి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. పంచదార పాకం వచ్చేదాక వేగించండి. అప్పుడు దాని మీద కాసింత జీడిపప్పు, వెనీలా ఎసెన్స్ ను వేసి బాగా కలపండి. ఇంకాస్త వేగాక.. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టండి. కాస్త వేడి తగ్గాక లొట్ట లేసుకుంటూ అరటిపండు హల్వాను లాగించేయడమే. ఒకవేళ ముక్కలు ముక్కలుగా చేసుకోవాంటే మాత్రం.. ఓ పళ్లెం తీసుకొని ఆ పళ్లానికి కాసింత నెయ్యి పూసి ఆ మిశ్రమాన్ని పళ్లెంలో పోసి పళ్లెం అంత పరచండి. కాస్త చల్లబడ్డాక ఆ మిశ్రమం గట్టిపడుతుంది. ఓ చాక్ తీసుకొని దాన్ని కావాల్సిన పరిమాణంలో ముక్కలు ముక్కలుగా కోసుకొని లప్ప లప్ప తినేయడమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version