సింగం, సింబాలు సినిమాల్లోని పోలీసులు. వాళ్లు వందమందినైనా మట్టికరిపించేయగలరు. కానీ.. అది సినిమాలోనే. నిజం కాదు కదా. కానీ.. సింగం, సింబాలను మించిన పోలీసు(రియల్ పోలీసు) ఒకరున్నారు. తమిళనాడు-కేరళ బోర్డర్ లోని కలియక్కవిలాయ్ అనే టౌన్ లో ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మోహన్ అయ్యర్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. ఆయన సింగం, సింబాలు.. ఇంకా రీల్ పోలీసులందరికీ తాత.
ఎందుకో తెలుసుకోవడానికి ముందు.. మనం ఇంకో విషయం చెప్పుకోవాలి. అదే.. కేరళలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న అయ్యప్ప గుడి వివాదం గురించి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శబరిమలలో ఎన్నో గొడవలు. చాలా మంది మహిళలు గుడిలోకి వెళ్లడానికి ప్రయత్నించడం.. ఇలా చాలా జరుగుతున్నాయి. మొన్నటి మొన్న జనవరి 2న ఇద్దరు మహిళలు అయ్యప్ప గుడిలోకి వెళ్లారు కదా. దీంతో ఆ వివాదం ఇంకాస్త ముదిరింది. ఆందోళనకారులు కూడా రెచ్చిపోయారు. కేరళలో హర్తాల్ నిర్వహించారు.
అలా… కలియక్కవిలాయ్ టౌన్ లో కూడా కేరళ బస్సును ఆందోళనకారులు ఆపడానికి ప్రయత్నించారు. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన బస్సును ఆపారు. దానిపై రాళ్లు విసిరేయబోయారు. బస్సును ధ్వంసం చేయబోయారు. బస్సు డ్రైవర్ పై దాడి చేయబోయారు. ఇంతలోనే సింగంలా వచ్చాడు ఆ ఎస్సై. ఒక్కడే ఎంతో దైర్యంగా ఆందోళనకారులను నిలువరించగలిగాడు. దమ్ముంటే బస్సును ఇప్పుడు టచ్ చేయాలంటూ సవాల్ విసిరాడు. అంతే.. మనోడి దైర్యాన్ని చూసి ఆందోళనకారులంతా అక్కడి నుంచి తుర్రుమన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటన గురించి తెలుసుకున్న కేఎస్ఆర్టీసీ ఎండీ థచంకరీ… ఎస్సైని మెచ్చుకోవడమే కాదు.. ఆయనకు 1000 రూపాయల రివార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని పంపించాడు.
(Video Courtesy: The Times of India)