చాల మంది ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకున్నాం, టీ లేదా కాఫి తాగి పేపర్ చదువుకున్నాం అయితే బ్లడ్ ప్రెజర్ చెక్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం అని అనుకుంటారు. ఇది సరైన సమయమేనా అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలామందికి తమ రక్తపోటును ఎలా, ఎప్పుడు కొలవాలో తెలియదు. సరిగ్గా కొలవకపోతే వచ్చే ఫలితాలు తప్పుగా ఉంటాయి. ముఖ్యంగా మనం బీపీ ను కొలిచే ముందు కొన్ని చిన్న చిన్న పనులు చేయకుండా ఉండాలి. సరైన సమయంలో సరైన పద్ధతిలో రక్తపోటును కొలవడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అప్పుడే డాక్టర్ కు సరైన సమాచారం మనం ఇవ్వగలుగుతాం.. మరి రక్తపోటును కొలిచే సరైన సమయం తెలుసుకుందాం.
రక్త పోటు కొలిచే సరైన సమయం : ఉదయం, సాయంత్రం వేళల్లో మీ రక్తపోటును కొలవడానికి ఉత్తమమైన సమయం ఉదయం నిద్ర లేచిన తర్వాత మరియు సాయంత్రం. ఉదయం కొలిచేటప్పుడు మీరు నిద్రలేచి కనీసం ఒక గంట తర్వాత ఏమీ తినకముందు లేదా తాగకముందు కొలవాలి. సాయంత్రం అయితే రాత్రి భోజనం చేయడానికి ముందుగా కలవడం మంచిది. ఇలా రోజుకు రెండుసార్లు కొలవడం వల్ల మీ రక్తపోటులో మార్పులను గమనించవచ్చు.

ఈ తప్పులు అసలు చేయకండి : వ్యాయామం చేసిన వెంటనే మీ రక్తపోటు పెరుగుతుంది. అందుకే వ్యాయామం పూర్తయిన కనీసం 30 నిమిషాల తర్వాత మాత్రమే బీపీ కొలవాలి. అంతేకాక ఆహారం తిన్న తర్వాత రక్తప్రసరణ జీవక్రియ వైపు ఎక్కువగా మల్లుతుంది. దీనివల్ల రక్తపోటు ఫలితాలు సరిగా రాకపోవచ్చు. అందుకే తిన్న తర్వాత కనీసం ఒక గంట సమయం ఆగిన తరువాతే రక్తపోటు చూడాలి. ఇక మూత్రం ఎక్కువగా ఉన్నప్పుడు బీపీ కొలిస్తే ఫలితాలు పెరిగినట్లుగా చూపించవచ్చు. కాబట్టి మూత్ర విసర్జన చేసిన తరువాతే కొలవడం మంచిది. రక్తపోటు కొలిచే ముందు కనీసం ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవాలి. ఫోన్ మాట్లాడడం, టీవీలు చూడడం వంటివి చేయకుండా ప్రశాంతంగా ఉన్న తర్వాతే కొలవాలి.
గమనిక : పైన పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, మీకు రక్తపోటు సమస్య ఉంటే దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి.