రక్తదానం చేయడం వలన ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు అని అందరికీ తెలిసిందే. ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తి రక్తదానం చేయడం వలన ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడటం మాత్రమే కాకుండా వారి కుటుంబానికి కూడా సహాయం చేసినట్టు అవుతుంది. పూర్తి ఆరోగ్యం బాగున్నవారు సంవత్సరంలో ఎన్నిసార్లు రక్తదానం చేయాలి అనే ప్రశ్న అందరికి తలెత్తుతుంది. చాలామంది రక్తదానం వలన రక్తహీనత ఏర్పడుతుందనే అపోహలో ఉంటారు. కానీ, వైద్యులు రక్తదానం చేసే ముందు శరీరంలో సరిపడా రక్తము ఉందా లేదా అనేది పరీక్షించి తర్వాత మాత్రమే రక్తాన్ని తీసుకుంటారు. ఎప్పుడైతే రక్తహీనత ఉంటుందో, వారి నుండి రక్తాన్ని తీసుకోరు.
రక్తదానం చేయడం వలన శరీరంలో ఇనుము కూడా సమతుల్యంగా ఉంటుంది. పైగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ అవుతుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనుక మీ ఆరోగ్య పరిస్థితుల ప్రకారం రక్త దానాన్ని చేసి ఈ ఉపయోగాలను పొందవచ్చు. ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి ఎనిమిది వారాలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు, అంటే రెండు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. రక్తదానం చేసే ముందు వైద్యులు పరీక్షలు చేసి రక్తాన్ని తీసుకుంటారు.
ఎలాంటి ఇన్ఫెక్షన్ లేక రక్త సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఉంటే, ముందుగా వైద్యులకు చెప్పాల్సి ఉంటుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలు రక్తదానం చేయకూడదు. మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు ఉన్నవారు కూడా రక్తదానం చేయకుండా, వైద్యుల సూచనలు పాటించాలి. హెపటైటిస్, హెచ్ఐవి వంటి వ్యాధులతో బాధపడుతున్నవారు రక్తదానం చేయకూడదు. ఇటువంటి వ్యాధులతో ఉన్నవారి నుండి రక్తాన్ని సేకరించడం వలన ఇతరులకు ఈ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. కనుక రక్తదానాన్ని చేసే ముందు ఆరోగ్య వివరాలను వైద్యులకు కచ్చితంగా తెలియజేయాలి.