కరోనా బారిన పడ్డవారు కోలుకున్న తరువాత ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో గుండె, కిడ్నీలు, లివర్ భాగాల్లో సమస్యలు వస్తున్నాయని తేల్చారు. కనుక కోవిడ్ నుంచి రికవరీ అయిన వారు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుని అవసరం అయితే వైద్యుల సూచన మేరకు మందులను వాడాలని నిపుణులు చెబుతున్నారు. అయితే కోవిడ్ బారిన పడి కోలుకున్న మహిళల్లో రుతు చక్రం సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
కోవిడ్ నుంచి కోలుకున్న మహిళల్లో నెలసరి సరిగ్గా రావడం లేదని, చాలా ఆలస్యంగా వస్తుందని, గతంలో కన్నా కోవిడ్ నుంచి కోలుకున్నాక పీరియడ్స్ సమయంలో నొప్పి బాగా ఉంటుందని, రక్తస్రావం అధికంగా ఉంటుందని, అలాగే రక్తం బాగా గడ్డ కడుతుందని గైనకాలజిస్టులు తెలిపారు. ఇలాంటి సమస్యలతో చాలా మంది తమ వద్దకు వస్తున్నారని డాక్టర్లు తెలిపారు. అయితే వారు ఇందుకు పరిష్కారాలను చెబుతున్నారు.
సాధారణంగా మహిళల్లో ఒత్తిడి, పోషకాహార లోపం కారణంగా హార్మోన్ల సమస్యలు ఏర్పడుతాయి. దీని వల్ల కొందరిలో సహజంగానే నెలసరి సరిగ్గా ఉండదు. అలాంటి వారు ఒత్తిడిని తగ్గించుకోవడం, పోషకాహారం తీసుకోవడం చేస్తే హార్మోన్ల సమస్యలు ఉండవు. దీంతో రుతు చక్రం సరిగ్గా ఉంటుంది. ఇక వీటితోపాటు రోజూ వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి చేయడం, ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించి సూచనలు, సలహాలు తీసుకోవడం, అన్ని పోషకాలు ఉండే ఆహారం రోజూ తీసుకోవడం వంటివి చేస్తే రుతు సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.