పిల్లల్లో చెవి నొప్పి, ఇన్ఫెక్షన్లు చాలా సాధారణం. కానీ వాటిని నిర్లక్ష్యం చేయకూడదు చిన్న సమస్యల అనిపించే ఈ ఇన్ఫెక్షన్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. ముఖ్యంగా పిల్లలు తమ బాధను సరిగ్గా చెప్పలేకపోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను కొన్ని ముఖ్యమైన సంకేతాలను గమనించడం చాలా అవసరం ఈ సంకేతాలు ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..
పిల్లలు చెవి ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నప్పుడు వారు తమ ఆసౌకర్యాన్ని మాటల ద్వారా వ్యక్తపరచలేరు అందుకే తల్లిదండ్రులు వారి ప్రవర్తనను జాగ్రత్తగా గమనించాలి. చెవి ఇన్ఫెక్షన్లకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంకేతాలు తెలుసుకోవడం ముఖ్యం.
చెవిని పదేపదే తాకడం : ఇంకా మాటలు రాని పిల్లలు చెవి నొప్పితో బాధపడుతుంటే వారు తమ తల్లిదండ్రుల దగ్గర చెవిని పదే పదే తాకుతూ కనిపిస్తారు. చిన్నపిల్లలు నిరంతరం తమ చెవిని తాకుతూ లేదా లాగుతూ ఉంటే అది చెవి నొప్పికి ఒక ముఖ్యమైన సంకేతం కావచ్చు. ఇలా పిల్లలు చేస్తున్నారు అంటే నొప్పి తట్టుకోలేక అలా చేస్తున్నారని అర్థం
అధికంగా ఏడవడం: చెవి నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లలు మామూలు కంటే ఎక్కువగా ఏడుస్తారు రాత్రిపూట నిద్రలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు ప్రశాంతంగా ఉండలేరు నిరంతరం చిరాకుగా ఉంటారు.ఇక పిల్లలు చెవి నొప్పి కారణంగా మింగడం నమడం కష్టమవుతుంది. దీని వల్ల పిల్లలు తినడానికి ఇష్టపడరు లేదా ఆకలిని కోల్పోతారు.

నిద్రలో ఇబ్బంది : చెవి నొప్పి నిలబడి లేదా కూర్చున్నప్పుడు కంటే పడుకున్నప్పుడు మరింత తీవ్రంగా ఉంటుంది. అందుకే పిల్లలు నిద్రపోవడానికి ఇబ్బంది పడతారు. నిద్రలో నుంచి తరచూ లేవడం పూర్తిగా నిద్ర లేకపోవడం వంటివి గమనించవచ్చు
వినికిడిలో మార్పులు: ఇన్ఫెక్షన్ కారణంగా మధ్య చెవిలో ద్రవం చేరి వినికిడి సామర్థ్యం తగ్గుతుంది దీనివల్ల పిల్లలు తక్కువగా వినడం మాటలకు స్పందించలేకపోవడం, టీవీ లేదా ఇతర వస్తువుల శబ్దాలను ఎక్కువగా పెట్టమని కోరడం వంటివి చేస్తుంటారు.
జ్వరం, చెవి నుండి నీరు: చాలా సందర్భాల్లో చిన్న పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్ రాగానే జ్వరం వస్తుంది. చెవి నుంచి పసుపు లేదా తెలుపు రంగులో నీరు బయటకు వస్తుంటే అది ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉందని అర్థం ఈ లక్షణం కనిపించినప్పుడు వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
ఇలాంటి సంకేతాలను తల్లిదండ్రులు గుర్తించి వెంటనే వైద్యున్ని సంప్రదించాలి సరైన సమయంలో చికిత్స అందించడం వల్ల తీవ్రమైన పరిణామాలు నివారించవచ్చు.