ప్రస్తుత కాలంలో పెద్దవాళ్ళలోనే కాదు, చిన్న పిల్లల్లో కూడా షుగర్ వ్యాధి (డయాబెటిస్) పెరుగుతోంది. దీన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు, కానీ అది చాలా ప్రమాదకరం. అయితే, కొన్ని ముఖ్యమైన సంకేతాలను గమనించడం ద్వారా ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించవచ్చు.
పిల్లలకు అసలు షుగర్ ఎందుకు వస్తుంది: సాధారణంగా పిల్లల్లో టైప్ 1 డయాబెటిస్ కనిపిస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ కణాలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేదు. ఇన్సులిన్ అనేది మన శరీరానికి అవసరమైన శక్తిని గ్లూకోజ్ రూపంలో కణాలకు చేర్చడానికి ఉపయోగపడుతుంది. అది లేకపోతే, గ్లూకోజ్ రక్తంలోనే పేరుకుపోతుంది. టైప్ 1 డయాబెటిస్‌కు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియకపోయినా, జన్యుపరమైన అంశాలు, వాతావరణ కారకాలు దీనికి కారణం కావచ్చు అని వైద్యులు భావిస్తున్నారు. అలాగే, అరుదుగా టైప్ 2 డయాబెటిస్ కూడా పిల్లల్లో కనిపిస్తుంది. ఇది సాధారణంగా అధిక బరువు, సరైన వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది.

చిన్న పిల్లల్లో కనిపించే ప్రధాన సంకేతాలు: తరచుగా మూత్ర విసర్జన చేయటం పిల్లలు మామూలు కంటే ఎక్కువగా బాత్రూమ్కి వెళ్తుంటే, ముఖ్యంగా రాత్రిపూట అది ఒక ముఖ్యమైన లక్షణం కావచ్చు. మూత్ర విసర్జన ఎక్కువగా ఉండటం వల్ల శరీరం నీటిని కోల్పోతుంది. దీనివల్ల పిల్లలకు ఎక్కువగా దాహం వేస్తుంది. శరీరం శక్తిని ఉపయోగించుకోలేకపోవడం వల్ల పిల్లలకు ఎంత తిన్నా ఆకలి తగ్గదు.
బాగా తింటున్నా కూడా పిల్లలు బరువు తగ్గడం గమనిస్తే, అది ఒక ముఖ్యమైన సంకేతం. పిల్లలో అలసట, నీరసం రక్తంలో షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలు ఎప్పుడూ బలహీనంగా కనిపిస్తారు. మసక గా కనిపించటం రక్తంలో చక్కెర స్థాయిలు కళ్లపై ప్రభావం చూపడం వల్ల దృష్టి మసకబారినట్లు అనిపిస్తుంది ఇటువంటివి సంకేతాలు కావచ్చు.
నివారణ చర్యలు: టైప్ 1 డయాబెటిస్‌ను నివారించడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇది రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. కానీ ఒకసారి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత, సరైన చికిత్స, జీవనశైలి మార్పులతో దానిని అదుపులో ఉంచుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడానికి పిల్లలకు పండ్లు కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారం ఇవ్వాలి. స్వీట్లు, జంక్ ఫుడ్ శీతల పానీయాలు తగ్గించడం చాలా ముఖ్యం. పిల్లలను రోజుకు కనీసం 60 నిమిషాలు ఆడుకోనివ్వాలి. ఆటలు, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి ప్రోత్సహించాలి. పిల్లలు అధిక బరువు ఉన్నట్లయితే దానిని తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవాలి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహనా కోసం మాత్రమే, ఎటువంటి అనారోగ్య సమస్యలు వున్నా వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.