అధిక బరువు, పొట్ట దగ్గరి కొవ్వు.. ఈ రెండు సమస్యలు చాలా మందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడేందుకు చాలా మంది వ్యాయామాలు చేస్తుంటారు. కానీ కొందరు అందుకు బద్దకిస్తారు. అయితే ఆయా సమస్యలను తగ్గించుకునేందుకు భారీ వ్యాయామాలు చేయకున్నా కనీసం పలు సూచనలను అయినా పాటించాల్సి ఉంటుంది. దీంతో పొట్ట దగ్గరి కొవ్వు కొంత వరకు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ సూచనలు ఏమిటంటే…
* నిత్యం మనం తినే ఆహార పదార్థాలు, తీసుకునే పానీయాలు, మింగే మెడిసిన్లు.. ఇలా రకరకాల పదార్థాల వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. ఇక శరీరం కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే వ్యర్థాలను బయటకు పంపుతుంది. కానీ శరీరం మొత్తాన్ని అంతర్గతంగా శుభ్రం చేసుకోవాలి. అందుకు గాను నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. లేదా కనీసం లీటరు నీటిని అయినా తాగి కొంత సేపు వాకింగ్ చేయాలి. దీంతో శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. పొట్ట దగ్గరి కొవ్వు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
* అధికంగా క్యాలరీలు ఉండే ఆహారాలను నిత్యం తీసుకున్నా పొట్ట దగ్గరి కొవ్వు పెరుగుతుంది. కనుక తక్కువ క్యాలరీలు ఉండే ఆహారాలను ఎంచుకోవాలి. బెర్రీలు, గ్రేప్ ఫ్రూట్, క్యారెట్లు, టమాటాలు, కీరదోస, పుచ్చకాయలు, యాపిల్స్, బ్రొకొలి వంటి వాటితోపాటు పాలు, పాల సంబంధ ఉత్పత్తులు, చికెన్, చేపలు, మిరపకాయలు వంటి వాటిని తింటే పొట్ట దగ్గర కొవ్వు చేరకుండా ఉంటుంది. అప్పటికే ఉన్న కొవ్వు కరిగేందుకు అవకాశం ఉంటుంది.
* పొట్ట దగ్గరి కొవ్వు కరగాలంటే ముఖ్యంగా మద్యం సేవించడం మానేయాలి. మద్యం వల్ల పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా చేరుతుంది.
* కొందరు ఏదో ఎత్తిపోతుందని చెప్పి చాలా వేగంగా భోజనం చేస్తారు. అలా చేయడం జీర్ణాశయంలో గ్యాస్ చేరి పొట్ట ఉబ్బుతుంది. దీంతో సహజంగానే పొట్ట ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. కనుక చాలా నెమ్మదిగా భోజనం చేయాలి. దీని వల్ల గ్యాస్ రాకుండా ఉంటుంది. పొట్ట నిండుగా కనిపించకుండా ఉంటుంది.
* చూయింగ్ గమ్ మానేయాలి. కొందరు అదే పనిగా చూయింగ్ గమ్‌లను నములుతుంటారు. వాటి వల్ల కూడా గ్యాస్ వచ్చి జీర్ణాశయం ఉబ్బుతుంది. అందువల్ల ఈ గమ్‌లను నమలడం మానేస్తే పొట్ట ఉబ్బెత్తుగా మారకుండా సమతలంగా ఉంటుంది.