మనమందరం బరువు తగ్గడానికి వ్యాయామాలు, కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ ఉంటాం. కానీ మీరు కష్టపడుతున్నా బరువు తగ్గడం లేదా? అప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించాలి..ఐతే మీరు నిద్ర సరిగా పోతున్నారా? అవును మీరు విన్నది నిజమే, మన శరీరానికి శక్తిని ఇచ్చే మంచి ఆహారం, వ్యాయామంతో పాటు, తగినంత నిద్ర కూడా చాలా ముఖ్యం. నిద్ర లేమి మరియు బరువు పెరగడం మధ్య ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సరిగా నిద్ర పోకపోతే మన శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా ఆకలిని పెంచే గ్రెలిన్, హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. అదే సమయంలో ఆకలిని నియంత్రించే లెస్సిన్ (Leptin) హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. దీని ఫలితంగా మనకు అనవసరంగా ఎక్కువ ఆకలి వేస్తుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వు ఎక్కువగా ఉన్న జంక్ ఫుడ్ తినాలనే కోరిక పెరుగుతుంది. ఈ మార్పుల కారణంగా మనం సాధారణం కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటాం. రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండటం వలన కూడా అదనపు స్నాక్స్ తినే అవకాశం పెరుగుతుంది, ఇవన్నీ క్యాలరీల సంఖ్యను పెంచి, క్రమంగా బరువు పెరగడానికి దారితీస్తాయి.

మంచి నిద్ర లేకపోతే మన శరీరం ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ (Cortisol) ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. కార్టిసాల్ అధికంగా విడుదలైనప్పుడు, ఇది శరీరం కొవ్వును నిల్వ చేసుకునే విధానాన్ని మారుస్తుంది, ముఖ్యంగా ఉదరం చుట్టూ కొవ్వు పెరిగేలా చేస్తుంది. అంతేకాకుండా, నిద్ర లేమి మన జీవక్రియ (Metabolism) రేటును నెమ్మదిస్తుంది.
అంటే, మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ మందగిస్తుంది దీని వలన శరీరం క్యాలరీలను సమర్థవంతంగా బర్న్ చేయలేదు. సరిగా నిద్ర పోకపోవడం వలన పగటిపూట అలసటగా, శక్తి లేనట్లుగా అనిపిస్తుంది. దీని కారణంగా వ్యాయామం చేయడానికి లేదా చురుకుగా ఉండటానికి మనకు శక్తి ఉండదు ఇది కూడా బరువు పెరగడానికి ఒక కారణమవుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు లేదా ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు ఆహారం మరియు వ్యాయామంతో పాటు 7 నుండి 8 గంటల నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. తగినంత నిద్ర మన శరీరంలోని హార్మోన్లను నియంత్రణలో ఉంచి, ఆకలిని తగ్గిస్తుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి, ఇకపై మీరు మీ బరువు సమస్యకు పరిష్కారం వెతుకుతున్నట్లయితే, మొదట మీ నిద్ర అలవాట్లను సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టండి. మంచి నిద్ర అనేది ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది లాంటిది.
గమనిక: ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది. బరువు పెరగడానికి నిద్ర లేమి ఒక్కటే కారణం కాకపోవచ్చు. ఇతర ఆరోగ్య సమస్యలు లేదా ఆహార లోపాలు కూడా కారణం కావచ్చు. కాబట్టి మీకు బరువు సమస్య దీర్ఘకాలంగా ఉంటే నిపుణుడైన డాక్టర్ లేదా డైటీషియన్‌ను సంప్రదించడం ఉత్తమం.
