థైరాయిడ్‌ చికిత్స తీసుకుంటే ఊడిన జుట్టు మళ్లీ వస్తుందట..!

-

మన శరీరంలో థైరాయిడ్‌ గ్రంథి పనితీరులో లోపం ఏర్పడితే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజంతో పాటు అనేక సమస్యలు వస్తాయి. థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి (Thyroid gland) అనేది మెడ మధ్య భాగంలో ఉండే స్వరపేటిక క్రింద ఉండే సీతాకోక చిలుక ఆకారపు అవయవం. ఇది శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీవక్రియను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేయడం, వివిధ శారీరక విధులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ గ్రంథి పనితీరులో లోపం ఏర్పడితే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజంతో పాటు ఆర్థరైటిస్ సమస్యలు వచ్చిపడతాయి.

హైపోథైరాయిడిజం

థైరాయిడ్ గ్రంధి తగిన మొత్తంలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో విఫలమైనప్పుడు హైపోథైరాయిడిజం అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కారణంగా అలసట, బరువు పెరగడం, నిరాశ, చర్మం నిర్జీవంగా మారడం, మలబద్ధకం, తరచుగా జలుబు వంటి అనేక లక్షణాలు ఉంటాయి. హైపోథైరాయిడిజం అనేది సాధారణంగా హషిమోటోస్ థైరాయిడిటిస్ అని పిలిచే ఆటో ఇమ్యూన్ వ్యాధి వల్ల వస్తుంది. అయితే థైరాయిడ్ సర్జరీ, రేడియేషన్ థెరపీ లేదా కొన్ని మందుల వల్ల కూడా హైపోథైరాయిడిజం రావచ్చు.

హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంధి అధిక మొత్తంలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడం వలన కలిగే పరిస్థితి. ఈ కారణంగా బరువు తగ్గడం, ఆకలి పెరగడం, చిరాకు, ఆందోళన, నిద్రలేమి, వేగవంతమైన హృదయ స్పందన, జ్వరం వంటి లక్షణాలను కలిగిస్తుంది. మీకు ప్రతిరోజు అలసటగా అనిపించడం? ఆకస్మికంగా బరువు పెరగడం, చలిగా అనిపించడం లేదా జుట్టు రాలడం గమనిస్తున్నారా లేదా అకారణంగా చెమటలు పట్టడం, ఆందోళనగా అనిపించడం ఉంటుందా? అయితే వీటన్నింటికీ థైరాయిడ్ గ్రంధి కారణం అని పేర్కొన్నారు.

హార్మోన్ స్థాయిలు చాలా తక్కువగా లేదా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు శరీంలో ఎలాంటి సంకేతాలు, మార్పులు గమనించవచ్చో వివరించారు.

బరువు పెరగడం లేదా బరువు తగ్గడం

బరువులో మార్పు అనేది థైరాయిడ్ రుగ్మతకు సంబంధించిన సాధారణ సంకేతాలలో ఒకటి. బరువు పెరగడం అనేది థైరాయిడ్ హార్మోన్ల తక్కువ స్థాయిని సూచిస్తుంది. దీనిని హైపో థైరాయిడిజం అంటారు. థైరాయిడ్ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే, మీరు బరువు తగ్గవచ్చు, ఈ పరిస్థితిని హైపర్ థైరాయిడిజం అంటారు. హైపర్ థైరాయిడిజం కంటే హైపోథైరాయిడిజం చాలా మందిలో సాధారణంగా వస్తుంది.

మెడలో వాపు

మెడలో వాపు థైరాయిడ్‌లో ఏదో లోపం ఉండవచ్చనే సంకేతాలు కనిపిస్తాయి. అసాధారణంగా విస్తరించిన థైరాయిడ్ గ్రంధి హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజంతో సంభవించవచ్చు. కొన్ని సార్లు మెడలో వాపు థైరాయిడ్ క్యాన్సర్ లేదా థైరాయిడ్‌తో సంబంధం లేని కారణం వల్ల సంభవిస్తుంది.

హృదయ స్పందన రేటులో మార్పులు

థైరాయిడ్ హార్మోన్లు దాదాపు శరీరంలోని అన్ని అవయవాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేయవచ్చు. మీకు హైపో థైరాయిడిజం ఉంటే హృదయ స్పందన రేటు సాధారణం కంటే నెమ్మదిగా ఉంటుంది. ఒకవేళ మీకు హైపర్ థైరాయిడిజం ఉంటే హృదయ స్పందన రేటు సాధారణం కంటే వేగంగా ఉంటుంది.

మానసిక కల్లోలం

థైరాయిడ్ రుగ్మతలు శరీరంలో శక్తి స్థాయిలు, మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి. హైపోథైరాయిడిజం ఉన్న వ్యక్తులు అలసిపోయినట్లు, నిదానంగా కదులుతారు, నిరాశకు గురవుతారు. అయితే హైపర్ థైరాయిడిజం ఆందోళన, నిద్రలో ఇబ్బంది, చంచలత్వం, చిరాకుకు దారితీస్తుంది.

జుట్టు రాలడం

జుట్టు రాలడం అనేది థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యతకి మరో సంకేతం. హైపోథైరాయిడిజం , హైపర్ థైరాయిడిజం రెండూ జుట్టు రాలడానికి దారితీస్తాయి. అయితే చాలా సందర్భాలలో, థైరాయిడ్ రుగ్మతకు చికిత్స చేసిన తర్వాత జుట్టు మళ్లీ పెరుగుతందని నిపుణులు అంటున్నారు..

ఈ లక్షణాలు ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version