స్మార్ట్‌ఫోన్లను ఎక్కువగా వాడడం వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పలు ఇతర దుష్పరిణామాలు కూడా ఫోన్లను వాడడం వల్ల మనకు కలుగుతాయి. అయితే కెనడాకు చెందిన పలువురు సైంటిస్టులు మాత్రం స్మార్ట్‌ఫోన్ల వాడకం వల్ల మనకు ఇంకా పెను నష్టమే కలిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అదేమిటంటే…
స్మార్ట్‌ఫోన్లను ఎక్కువగా వాడడం వల్ల డిప్రెషన్ బారిన పడి ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచనలు ఎక్కువగా వస్తాయని కెనడాకు చెందిన టొరంటో వెస్టర్న్ హాస్పిటల్ పరిశోధకులు తేల్చారు. ఈ మేరకు వారు తమ పరిశోధనల వివరాలను కెనెడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించారు కూడా. స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వాడడం వల్ల శారీరక అనారోగ్య సమస్యలతోపాటు మానసిక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని వారంటున్నారు.
ఫోన్లను శృతి మించి వాడితే డిప్రెషన్ బారిన పడి ఆ తరువాత ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటారని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా యువత ఈ ప్రమాదం బారిన ఎక్కువగా పడేందుకు అవకాశం ఉంటుందని వారు అంటున్నారు. కనుక పెద్దలు పిల్లలను ఫోన్లు ఎక్కువగా వాడకుండా చూసుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు..!