పిల్లల్లో ఎపిలేప్సీ లేదా ఫిట్స్ అనేది తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే సమస్య. ఈ వ్యాధి గురించి సమాజంలో చాలా అపోహలు, భయాలు ఉన్నాయి కానీ శాస్త్రీయ జ్ఞానం సరైన సమాచారంతో ఈ సమస్యను అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాధి సాధారణంగా పిల్లల్లోనే ఎక్కువ కనిపిస్తుంది. దీని గురించి అనేక అపోహలు ఉన్నాయి కానీ నిజాలని తెలుసుకోవడం చాలా ముఖ్యం.. మరి అపోహలు నిజాలకు తేడా ఏంటి అనేది చూద్దాం..
అపోహ: ఫిట్స్ లేదా మూర్చలు అంటే కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకం గా భావిస్తారు. ఇది ఎంత మాత్రం నిజం కాదు.
నిజం : ఫిట్స్ ఒక వైద్య సమస్య మెదడులో విద్యుత్ సంకేతాలు సరిగా పని చేయకపోవడం వల్ల వస్తుంది. ఇది శాస్త్రీయంగా వివరించబడిన నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్య, మూఢనమ్మకం కాదు.
అపోహ: ఫిట్స్ వస్తే పిల్లలు సాధారణ జీవితం గడపలేరు.
నిజం : ఎవరిలోనైనా ఫిట్స్ వ్యాధి వస్తే చికిత్సతో చాలామందికి తగ్గి సాధారణ జీవితం గడుపుతున్న వారున్నారు. పిల్లలలో సరైన చికిత్సతో ఈ సమస్యను తగ్గించవచ్చు. వారి స్కూల్ కి వెళ్లి ఆడుకోవచ్చు ఇతరులతో సమానంగా జీవించవచ్చు.
అపోహ: ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో ఇనుప వస్తువులు పెట్టడం, నోటిలో చెంచా లేదా వేలు ఉంచడం, లేదా వారిని కదలకుండా గట్టిగా పట్టుకోవడం వంటివి చేస్తుంటారు.
నిజం : ఇది చాలా ప్రమాదకరం ఫిట్స్ సమయంలో నోటిలో ఏదీ పెట్టకూడదు పిల్లవాడిని మెత్తని ప్రదేశంపై పక్కకు తిప్పి పడుకోబెట్టాలి.తద్వారా వారి నోటిలోని లాలాజలం సులభంగా బయటకు వెళ్ళిపోతుంది. వారి చుట్టూ ఉన్న ప్రమాదకరమైన వస్తువులను తొలగించాలి. ఫిట్స్ సాధారణంగా కొన్ని నిమిషాల్లో ఆగిపోతుంది.

అపోహ: ఫిట్స్ పూర్తిగా నయం కాదు.
నిజం : ఎక్కువమంది పిల్లలలో వారు ఎదిగే కొద్దీ సమస్య తగ్గిపోతుంది. కొంతమందిలో చికిత్స తీసుకొని మందులు వాడిన తరువాత తగ్గుముఖం పడుతుంది. కొంతమందికి ఆపరేషన్ ద్వారా తగ్గించవచ్చు. పూర్తిగా నయం కాదు అనేది అపోహ మాత్రమే, ఇది ఎంతవరకు నిజం కాదు.
ఫిట్స్ లేదా మూర్చ తీసుకోవాల్సిన జాగ్రత్తలు: నరాల వైద్య నిపుణులను ఎంచుకొని పిల్లలని చూపించాలి. వైద్యుడు సరైన రోగ నిర్ధారణ చేసి చికిత్సకు సూచిస్తారు. డాక్టర్ సూచించిన మందులను సమయానికి పిల్లలకు ఇవ్వడం. ఫిట్స్ గురించి తెలుసుకొని భయాన్ని దూరం చేయాలి. పిల్లలు బయటికి వెళ్లాలంటే ఎక్కువగా భయపడతారు మళ్లీ ఫిట్స్ వస్తాయి ఏమోనని వారు భయపడుతూ ఒత్తిడికి లోనవుతారు అలాంటి వారిని దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పి వారికి ఉన్న భయాలన్నీ దూరం చేయాలి.
ఫిట్స్ ఉన్న పిల్లలు సరైన జాగ్రత్తలతో సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. అపోహలను వదిలి వైద్య సలహా తీసుకోవడం ముఖ్యం.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే,ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.