సృజనాత్మకత అనేది కేవలం ఓక కల కి పరిమితం కాదు, అది మన జీవితంలోని ప్రతి అడుగులోను అవసరం. ఒక సమస్యను కొత్త కోణంలో పరిష్కరించడం కొత్త ఆలోచనలను రూపొందించడం ఈ ప్రపంచాన్ని విభిన్నంగా చూడడం ఇవన్నీ క్రియేటివిటీకు ఉదాహరణలు. కానీ నేటి సమాజంలో పిల్లల్లో ఈ అమూల్యమైన నైపుణ్యం క్రమంగా తగ్గిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు తెలుసుకుందాం..
పిల్లలు చిన్నప్పుడు తమ ఊహాశక్తితో రంగులు నింపుతూ, గీతలు గీస్తూ, వింత కథలను చెబుతూ ఉంటారు. కానీ పాఠశాల జీవితం మొదలయ్యాక వారిలో క్రియేటివిటీ తగ్గుతూ వస్తుంది. దీనికి మొదటి కారణం అతిగా నిర్మాణాత్మకమవుతున్న విద్యావ్యవస్థ. మన విద్యా విధానం ఎక్కువ కఠినంగా ఉండడం నిర్దిష్టమైన సమాధానాలకే ప్రాధాన్యత ఇవ్వడం, పిల్లలు ఒకే రకమైన సమాధానాలను రాయడం అలవాటు చేసుకోవడంతో వారిలో కొత్తగా ఆలోచించే నైపుణ్యం తగ్గుతుంది. మార్కుల ఒత్తిడితో క్రియేటివిటీకి చోటు లేకుండా పోతుంది. స్కూల్లో ఒక ప్రశ్నకు ఇదే సమాధానం అని వారు బట్టి పట్టడం అలవాటు చేసుకుంటున్నారు. ఇది ఎక్కువగా ప్రైవేటు రంగ సంస్థలైన స్కూళ్లలో జరగడం మనం గమనిస్తున్నాం. ఈ విద్యా విధానానికి అలవాటు పడిన పిల్లలు వారిలో ఉండే క్రియేటివిటీని బయటకు తీసుకు రాలేకపోతున్నారు.

రెండవ కారణం డిజిటల్ ప్రపంచం యొక్క ప్రభావం స్మార్ట్ ఫోన్లు, టాబ్, వీడియో గేమ్ పిల్లలకు అపరిమితమైన వినోదాన్ని అందిస్తున్నాయి. ఇది వారిని కన్జ్యూమర్లుగా మారుస్తుంది సొంతగా బొమ్మలు వేయడం, కొత్త ఆటలను సృష్టించడం, కథలను అల్లడం వంటి క్రియేటివిటీ పనులకు బదులుగా స్క్రీన్ వచ్చే కంటెంట్ ను చూస్తూ గడిపేస్తున్నారు. దీని వల్ల వారిలో అంతర్గతంగా ఉండే క్రియేటివిటీ శక్తి బయటకు రావట్లేదు.
ఇక పిల్లల జీవితంలో ఆటస్థలం లేకపోవడం, గతంలో పిల్లలు బయట స్వేచ్ఛగా ఆడుకునేవారు. మట్టిలో చెట్ల కింద స్నేహితులతో కలిసి కొత్త ఆటలను కనిపెట్టేవారు. అలాంటి ఆటలు వారిలో సమస్య పరిష్కారణ నైపుణ్యాలను, ఊహాశక్తిని పెంచేవి కానీ ఈ రోజుల్లో భద్రతా కారణాలవల్ల స్థలం లేకపోవడం వల్ల పిల్లలు ఎక్కువగా ఇంటికే పరిమితమవుతున్నారు. ఎక్కువగా అపార్ట్మెంట్ జీవితానికి అలవాటు పడటం పిల్లలు నేర్చుకుంటున్నారు.
అతిగా నియంత్రించే తల్లిదండ్రులు కూడా పిల్లల క్రియేటివిటీ కి అడ్డుగా నిలబడుతున్నారని చెప్పవచ్చు. పిల్లలు తప్పు చేస్తారేమోనని పాడైపోతారేమోనని భయంతో తల్లిదండ్రులు వారిని అతిగా నియంత్రించడం ప్రతి పనిలోనూ జోక్యం చేసుకోవడం సృజనాత్మకతకు అడ్డుగోడగా మారుతుంది. పిల్లలు తమ తప్పుల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటారు. వారికి స్వేచ్ఛనిస్తేనే వారిలో క్రియేటివిటీ బయటపడుతుంది.