చిలగడ దుంప,చల్లగడ్డ (Sweet Potato) పేరు వినగానే తియ్యగా ఉంటుంది కదా షుగర్ పేషెంట్లు తినకూడదనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ నిజానికి ఈ దుంప మధుమేహులకు ఒక వరం లాంటిదని మీకు తెలుసా? పోషకాహార నిపుణులు చెబుతున్న మాట ఏమిటంటే, ఈ ఆరోగ్యకరమైన దుంపను సరైన మోతాదులో తీసుకుంటే మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చట. దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం.
షుగర్ కంట్రోల్లో స్వీట్ పొటాటో పాత్ర: స్వీట్ పొటాటోలో తీపి ఉన్నప్పటికీ, ఇందులో సాధారణ బంగాళాదుంపల కంటే ‘గ్లైసెమిక్ ఇండెక్స్’ (GI) తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉడికించిన చిలగడ దుంపలలో తక్కువ GI ఉంటుంది. దీనికి కారణం ఇందులో ఉండే అధిక పీచుపదార్థం (Fiber). ఫైబర్ రక్తంలోకి చక్కెర విడుదలయ్యే ప్రక్రియను నెమ్మదిస్తుంది.
దీని కారణంగా భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నివారించవచ్చు. అంతేకాకుండా, చిలగడ దుంపలలో ఉండే యాంటీ-డయాబెటిక్ కాంపౌండ్స్, ఆంథోసైనిన్స్ (ముఖ్యంగా పర్పుల్ స్వీట్ పొటాటోలలో) ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

తీసుకోవాల్సిన మోతాదు, నిపుణుల సలహాలు: స్వీట్ పొటాటో మేలు చేస్తుందన్నంత మాత్రాన ఇష్టం వచ్చినంత తినకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మధుమేహం ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవడం ముఖ్యం. అలాగే ఈ దుంపను ఉడికించి లేదా ఆవిరిపై ఉడకబెట్టి తినడం ఉత్తమం. కాల్చడం లేదా వేయించడం వల్ల దాని GI విలువ పెరిగే అవకాశం ఉంది. మీ రోజువారీ ఆహారంలో కార్బోహైడ్రేట్ల మోతాదు ఆధారంగా, డాక్టర్ లేదా డైటీషియన్ సలహా మేరకు సరైన పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.
సరైన పద్ధతిలో మితంగా తీసుకుంటే స్వీట్ పొటాటో మధుమేహ నియంత్రణకు ఒక మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. దీనిలోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మీ బంధానికి మేలు చేయడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పదిలంగా ఉంచుతాయి.
