ఎంతో మంది మహిళలు కెరీర్ స్థిరత్వం కోసం 30 ఏళ్లు దాటిన తర్వాత గర్భధారణ గురించి ఆలోచిస్తున్నారు. ఆలస్యమైనా, మాతృత్వం అనేది అద్భుతమైన అనుభూతి. కానీ ఈ వయసులో కొన్ని అదనపు జాగ్రత్తలు, ముఖ్యమైన పరీక్షలు తప్పనిసరి. వీటిని నిర్లక్ష్యం చేస్తే, తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంటుంది. మీ ప్రయాణం సురక్షితంగా, సంతోషంగా సాగడానికి చేయాల్సిన ముఖ్య పరీక్షలు ఏంటో తెలుసుకుందాం..
ముఖ్యమైన పరీక్షలు మరియు జాగ్రత్తలు: వయసు పెరిగే కొద్దీ అండాల నాణ్యత తగ్గడం, కొన్ని ఆరోగ్య సమస్యల (మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్) రిస్క్ పెరగడం సాధారణం. అందుకే గర్భం ధరించడానికి ప్రయత్నించే ముందే పూర్తి ‘ప్రీ-ప్రెగ్నెన్సీ చెకప్’ చేయించుకోవాలి.
సాధారణ రక్త పరీక్షలు: రక్తహీనత, రక్తంలో చక్కెర స్థాయి (గర్భధారణ మధుమేహం కోసం), థైరాయిడ్ పనితీరు (TSH), మరియు విటమిన్ స్థాయిలను తెలుసుకోవడానికి ఈ పరీక్షలు ముఖ్యం.

జన్యుపరమైన స్క్రీనింగ్ : 35 ఏళ్లు పైబడిన వారికి డౌన్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన సమస్యలు వచ్చే రిస్క్ పెరుగుతుంది. నాన్-ఇన్వాసివ్ ప్రీనేటల్ టెస్టింగ్ (NIPT), ట్రిపుల్/క్వాడ్రపుల్ మార్కర్ స్క్రీనింగ్ వంటి పరీక్షలు తప్పక చేయించుకోవాలి.
అల్ట్రాసౌండ్ మరియు ఇతర స్కానింగ్‌లు: అండాశయాల ఆరోగ్యం, గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు వంటి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి స్కానింగ్‌లు అవసరం. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో శిశువు ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం చాలా ముఖ్యం.
ప్రమాదాల నివారణకు జీవనశైలి మార్పులు: పరీక్షలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అత్యవసరం. ధూమపానం, మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. బరువును అదుపులో ఉంచుకోవడం పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం, ఫోలిక్ యాసిడ్ వంటి ప్రినేటల్ విటమిన్లను డాక్టర్ సలహా మేరకు ముందుగానే తీసుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడిని తగ్గించుకోవడం తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ఆరోగ్యకరమైన గర్భధారణకు తోడ్పడతాయి. మీ వైద్యుడితో నిరంతర సంప్రదింపులు వారి సలహాలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.
30 ఏళ్లపైబడిన గర్భధారణలో సవాళ్లు ఉన్నప్పటికీ సరైన వైద్య పర్యవేక్షణ, ముఖ్యమైన పరీక్షలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పుల ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వడం సాధ్యమే.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీరు గర్భధారణ గురించి ఆలోచిస్తున్నట్లయితే లేదా గర్భవతిగా ఉన్నట్లయితే మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి మరియు అవసరాలకు తగిన సలహా కోసం తప్పనిసరిగా మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి.
