ఈరోజుల్లో చాలామంది అమ్మాయిలకు చిన్న వయసులోనే రుతుక్రమం(పీరియడ్స్) ప్రారంభమవుతుంది. దీనికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ మన ఆహారపు అలవాట్లు ముఖ్యంగా ప్రాసెస్ ఫుడ్ దీనిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను అరికట్టడానికి మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలు పిల్లల్లో ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచి, పీరియడ్స్ త్వరగా రావడానికి దారితీస్తాయి. మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడానికి మీరు దూరంగా ఉంచాల్సిన కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రాసెస్డ్, ప్యాకేజీ ఫుడ్స్ : బిస్కెట్లు, చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, ప్రాసెస్ట్ మాంసం వంటి వాటిలో హానికరమైన రసాయనాలు కృత్రిమ ఫ్లేవర్లు చక్కెరలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి. దీనివల్ల చిన్న వయసులోనే పీరియడ్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది పిల్లలకు వీటిని దూరంగా ఉంచడానికి ప్రయత్నించాలి.
చెక్కెర, తీపి పదార్థాలు : అధికంగా చక్కెర కలిగిన కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, స్వీట్లు, ఇన్సులిన్ నిరోధకతకు కారణమవుతాయి. ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ పరిస్థితి అకాల పీరియడ్స్ రావడానికి దారితీస్తుంది.

అధిక కొవ్వు పదార్థాలు: ఫాస్ట్ ఫుడ్స్, వేయించిన ఆహారాలు, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే పదార్థాలు ఊబకాయానికి కారణమవుతాయి. ఊబకాయం వల్ల శరీరంలో కొవ్వు కణాలు పెరిగి ఈస్ట్రోజన్ ఉత్పత్తి పెరుగుతుంది దీనివల్ల పీరియడ్స్ త్వరగా వస్తాయి.
సోయా ఉత్పత్తులు : సోయాలో ఫైట్ ఈస్ట్రోజన్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఈస్ట్రోజన్ మాదిరిగా పనిచేస్తాయి. అధికంగా సోయా పాలు, సోయా ఆధారిత ఉత్పత్తులను తీసుకోవడం వల్ల హార్మోన్లు సమతుల్యత దెబ్బతింటుంది.
పిల్లల్లో చిన్న వయసులో పీరియడ్స్ రావడం అనేది ఒక ఆరోగ్య సమస్య. దీనికి ముఖ్య కారణాలలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాటు ఒకటి. ప్యాకెట్ ఫుడ్స్ అధిక చెక్కర కొవ్వు పదార్థాలు సోయా ఉత్పత్తులను పరిమితం చేయడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు నియంత్రించవచ్చు. మీ పిల్లలకు పోషకాలు అధికంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఇవ్వడం ఉత్తమం. వారి ఆరోగ్యాన్ని కాపాడడానికి సరైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం తల్లిదండ్రుల బాధ్యత.
గమనిక:పైన ఇచ్చిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే, మీ పిల్లల ఆరోగ్యం గురించి ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా వైద్య నిపుణుని సంప్రదించండి.