మన తెలుగు వంటకాల్లో టమాటోకు ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పులుపు, రంగు, రుచి ఇలా వంటకానికి జీవం పోస్తుంది. అయితే టమాటో గురించి చాలా కాలంగా ఒక భయంకరమైన అపోహ ప్రచారంలో ఉంది. టమాటో తింటే కిడ్నీలో రాళ్లు (కిడ్నీ స్టోన్స్) ఏర్పడతాయి అని ఈ మాట విని చాలా మంది టమాటోను ఆహారంలో పూర్తిగా తీసేస్తుంటారు. కానీ ఈ వాదనలో ఎంతవరకు నిజం ఉంది? నిపుణులు, డాక్టర్లు ఈ విషయంలో ఏం చెబుతున్నారు? ఈ ప్రాచుర్యంలో ఉన్న నమ్మకం వెనుక ఉన్న శాస్త్రీయ ఆధారం ఏమిటో తెలుసుకుని, మీ అనుమానాలను నివృత్తి చేసుకుందాం..
టమాటోలో ఆక్సిలేట్స్: కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే పదార్థాలలో ముఖ్యమైనది ‘కాల్షియం ఆక్సిలేట్’. దాదాపు 80% కిడ్నీ స్టోన్స్ ఈ రకానికి చెందినవే. టమాటోలో సహజంగానే ఆక్సిలేట్స్ ఉంటాయి ముఖ్యంగా వాటి విత్తనాలలో. ఈ కారణంగానే టమాటోను ఎక్కువగా తింటే కిడ్నీ స్టోన్స్ వస్తాయనే అపోహ బలంగా నాటుకుపోయింది.
అయితే నిపుణులు చెప్పే నిజం ఏమిటంటే, టమాటోలో ఆక్సిలేట్స్ శాతం ఇతర ఆకుకూరలు ఉదాహరణకు పాలకూర మరియు గింజలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. నిజానికి ఒక మధ్యస్థాయి టమాటోలో ఉండే ఆక్సిలేట్ కంటెంట్ పెద్ద మొత్తంలో కిడ్నీ రాళ్లను కలిగించేంత ప్రమాదకరమైనది కాదు. అందుకే సాధారణంగా రోజువారీ ఆహారంలో టమాటోను మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతులకు ఎటువంటి ప్రమాదం ఉండదు.

ఎవరికి ప్రమాదం? వైద్య నిపుణుల సలహా!: టమాటో విషయంలో అందరూ భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు లేదా తరచుగా స్టోన్స్ సమస్యతో బాధపడేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు ఆక్సిలేట్ అధికంగా ఉండే ఏ ఆహారాన్ని అయినా కేవలం టమాటోనే కాకుండా పరిమితం చేసుకోవడం మంచిది.
ముఖ్యంగా టమాటో విత్తనాలను పూర్తిగా తొలగించి, దాని గుజ్జును మాత్రమే వాడటం లేదా టమాటో వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి ప్రధాన కారణం తగినంత నీరు తాగకపోవడం మరియు అధిక ఉప్పు, జంతు మాంసకృత్తులు కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం. కేవలం టమాటోను మాత్రమే నిందించడం సరైనది కాదు.
గమనిక: ఇప్పటికే కిడ్నీ స్టోన్స్ సమస్య ఉంటే లేదా ఆక్సిలేట్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని అనుమానం ఉంటే, మీ ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలనే దానిపై వైద్య నిపుణుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం అత్యంత ముఖ్యం.
