మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఎసెన్షియల్ ఆయిల్స్‌లో టీ ట్రీ ఆయిల్ కూడా ఒకటి. ఇది మన చర్మాన్ని, వెంట్రుకలను సంరక్షించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్, క్వీన్స్‌ల్యాండ్‌లలో పెరిగే Melaleuca Alternifolia అనే వృక్షం ఆకుల నుంచి ఈ ఆయిల్‌ను తీస్తారు. దీంట్లో మనకు ఉపయోగపడే అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. అయితే ఆరోగ్యకర ప్రయోజనాలే కాక టీ ట్రీ ఆయిల్ తో మనకు పలు ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* టీ ట్రీ ఆయిల్ సహజసిద్ధమైన హ్యాండ్ శానిటైజర్లా పనిచేస్తుంది. ఇది బాక్టీరియాను నాశనం చేయగలదు. ఇ.కోలి, న్యుమోనియా, హెచ్.ఇన్‌ఫ్లూయెంజా తదితర బాక్టీరియా, వైరస్‌లను ఈ ఆయిల్ నాశనం చేస్తుంది. అందువల్ల ఈ ఆయిల్‌ను హ్యాండ్ శానిటైజర్లా కూడా వాడవచ్చు.
* టీ ట్రీ ఆయిల్‌ను స్ప్రే బాటిల్లో పోసి స్ప్రే చేస్తే.. ఇండ్లలో ఉండే పురుగులు, దోమలు, ఇతర కీటకాలు నశిస్తాయి.
* టీ ట్రీ ఆయిల్‌ను సహజసిద్ధమైన డియోడరంట్లా కూడా వాడవచ్చు.
* కాలిన గాయాలు, పుండ్లు, ఇతర దెబ్బలను నయం చేయడంలో కూడా టీ ట్రీ ఆయిల్ అమోఘంగా పనిచేస్తుంది. గాయాన్ని సబ్బు నీటితో శుభ్రంగా కడిగాక దానిపై టీ ట్రీ ఆయిల్‌ను అప్లై చేసి అనంతరం పైన శుభ్రమైన వస్త్రంతో బ్యాండేజ్‌లా కట్టు కట్టాలి. దీంతో గాయాలు త్వరగా నయమవుతాయి.
* మొటిమల సమస్యలు ఉన్నవారు నిత్యం టీ ట్రీ ఆయిల్‌ను వాటిపై అప్లై చేస్తుంటే.. ఆ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు.
* టీ ట్రీ ఆయిల్‌ను మౌత్‌వాష్‌గా కూడా ఉపయోగించవచ్చు. కొద్దిగా ఆయిల్‌ను నోట్లో వేసుకుని 30 సెకన్ల పాటు బాగా పుక్కిలించాలి. దీంతో నోటి దుర్వాసన, దంతాలు, చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది.
* శరీరంలోని ఆయా భాగాల్లో నొప్పి, వాపు ఉన్నవారు టీ ట్రీ ఆయిల్‌ను రాస్తే ఫలితం ఉంటుంది.
* చుండ్రు సమస్య ఉన్నవారు టీ ట్రీ ఆయిల్‌ను తలకు రాసి మర్దనా చేయాలి. తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం 2, 3 సార్లు చేస్తే చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు.