పెళ్లి చేసుకోవాలని ఈరోజుల్లో చాలా మంది యువత అస్సలు అనుకోవడం లేదు. అదొక తలనొప్పి, అనవసరపు బాధ్యతగా భావిస్తున్నారు. దీనికి కారణం.. ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్, బాగా తెలిసినవారికి పెళ్లి వల్ల ఏదైనా నెగిటివ్ జరిగిన ప్రభావం మీ మీద బాగ పడుతుంది. దాని వల్ల పెళ్లి లేట్ అవుతుంది. ఇలా చాలా 32 ఏళ్లకు పెళ్లి చేసుుకున్నా.. వెంటనే పిల్లల్ని కనేందుకు ఇష్టపడరు. అలా పోస్ట్‌పోన్ చేసుకునేవాళ్లు ఉన్నారు. ఇంకొందరికి ఏదొక సంతాన సమస్య వల్ల పిల్లలు కలగలరు. ఇలా 35 ఏళ్లకు గర్భం దాల్చితే.. అది నిలుస్తుందా..? మహిళల ఆరోగ్యంపై ఈ ప్రెగ్నెన్సీ ప్రభావం చూపిస్తుందా..?
35 ఏళ్ల తర్వాత కూడా గర్భం దాల్చే అవకాశాలు అందరిలో తగ్గుతాయని చెప్పలేం. కానీ కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. వయసు పెరిగే కొద్ది మహిళల్లో అండం నాణ్యత తగ్గిపోతుంది. హార్మోన్లలో కూడా మార్పులు వస్తాయి.
ఆలస్యంగా గర్భం దాల్చడం వల్ల వచ్చే సమస్యలు
మెనోపాజ్ దశకు దగ్గర పడుతున్న కొద్దీ మహిళల్లో గర్భధారణ అంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటే అండాల సంఖ్య సమయంతో పాటూ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే అండం నాణ్యత కూడా వయసుతో పాటూ తగ్గే అవకాశం ఉంది.. దానివల్ల అండం ఫలదీకరణ చెందడం కాస్త కష్టంగా మారొచ్చు.
గర్భస్రావం:
అండం నాణ్యత తగ్గిన కొద్దీ, గర్భస్రావం అయ్యే అవకాశం పెరుగుతుంది. దాంతో పాటే అధిక రక్తపోటు, మధుమేహం లాంటి ఆరోగ్య సమస్యలుంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గర్భధారణ కన్నా ముందే ఈ వయసులో ఉన్నవాళ్లు వైద్యుల సలహాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.
క్రోమోజోమ్ సమస్యలు:
ఆలస్యంగా గర్భం దాల్చే మహిళల్లో పుట్టబోయే బిడ్డలో క్రోమోజోమ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డౌన్ సిండ్రోమ్‌తో బిడ్డ పుట్టే ప్రమాదం 35 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 365 మందిలో ఒకరికి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఈ ప్రమాదం ఇంకా పెరిగే చాన్స్ ఉంది.
మధుమేహం, అధిక రక్తపోటు:
మధుమేహం సమస్య ఉన్న గర్భిణీ కడుపులో ఉన్నప్పుడే బిడ్డ పెద్దగా పెరిగే ప్రమాదం ఉంది. అటువంటప్పుడు, ప్రసవం సమయంలో గాయం అయ్యే ప్రమాదం ఎక్కువ, లేదా చనిపోయిన బిడ్డ పుట్టే ప్రమాదం కూడా ఉంది. అదనంగా, అధిక రక్తపోటు తల్లికి ఉంటే పిల్లల్లో కొన్ని ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
వీటితో పాటే ముందస్తు ప్రసవం, క్రోమోజోమ్ అసాధారణతలు, గర్భాశయ పెరుగుదల పరిమితులు, ప్రీమెచ్యూరిటీ, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో చేరడం, శిశువులో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఇది అందరిలో జరగాలని లేదు, ప్రతి ఒక్కరిలో తేడాలుంటాయి.
సంతాన లేమి, గర్భదారణ సమస్యలు ఏ వయసు వాళ్లకైనా వస్తాయి. ఎక్కువ వయసున్న మహిళల్లో కూడా ఆరోగ్యకరమైన గర్భధారణ, ప్రసవం జరుగుతాయి. ఇప్పుడు ఐవీఎఫ్, ఎగ్ ఫ్రీజింగ్ లాంటి అనేక మార్గాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.