సాధారణంగా ఆరోగ్యం బాగుండాలని ఎన్నో రకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. అయితే, ఇతరులు చెప్పడం వలన ఎటువంటి ఆలోచన చేయకుండా ఆరోగ్య ప్రయోజనాలను పొందడం కోసం వాటిని తీసుకుంటూ ఉంటారు. అయితే, వాటిలో మఖానా కూడా ఒకటి. దీనిని ఫాక్స్ నట్స్ లేక లోటస్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. వీటిలో ఉండే పోషక విలువలు ఆరోగ్యానికి ఎంతో సహాయం చేస్తాయి మరియు మఖానాలో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కనుక స్నాక్స్ లో భాగంగా వీటిని తీసుకోవడం తీసుకోవచ్చు. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారు దీనిని తరచుగా తీసుకుంటారు. వీటిలో ఉండే ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పైగా మఖానాలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటి వలన రోగనిరోధక శక్తి కూడా మెరుగ్గా ఉంటుంది. అయితే నిపుణుల ప్రకారం మఖానాలో ఎన్నో పోషక విలువలు ఉన్నప్పటికీ కొంతమంది వీటికి దూరంగా ఉండాలి అని చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లయితే మఖానాకు దూరంగా ఉండడం మేలు. వీటిలో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువలన గ్యాస్ట్రిక్, కడుపునొప్పి, వికారం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.
అంతేకాకుండా కిడ్నీకి సంబంధించిన సమస్యలతో బాధపడేవారు మఖానాను తీసుకోకూడదు. ఎప్పుడైతే కిడ్నీలో రాళ్లు ఉంటాయో, మఖానాను తీసుకోవడం వలన ఈ సమస్య తీవ్రత మరింత ఎక్కువవుతుంది. వీటిలో ఉండే క్యాల్షియం శరీరంలో క్యాల్షియం పరిమాణాన్ని పెంచుతుంది. దీంతో కిడ్నీ సమస్యలు ఎక్కువ అవుతాయి. అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు మఖానాను ఎక్కువగా తీసుకోకూడదు. దీనిలో ఉండే స్టార్చ్ అలర్జీ వంటి వాటిని ఎక్కువ చేస్తుంది. కనుక, ఇటువంటి సందర్భాలలో మఖానను తీసుకోకపోవడమే మేలు అని నిపుణులు చెబుతున్నారు.