సొరంగం బావులు.. ఏంటీ.. వినేందుకు చాలా కొత్తగా ఉందే.. అని ఆశ్చర్యపోతున్నారా..? అయినా.. ఇది నిజమే. కానీ అవి కొత్తవేమీ కాదు. పాతవే. కానీ మనలో చాలా మందికి ఇంకా వీటి గురించి తెలియదు. పర్వతాల్లో దాగి ఉన్న నీటి ఊటను పసిగట్టి అక్కడి వరకు సొరంగంలా తవ్వుతూ వెళ్లాలి. అంతే.. అక్కడి నీరు సొరంగంలో ప్రవహిస్తూ బయటకు వస్తుంది. దాన్ని పల్లంలోకి దారి మళ్లించి ఒక నీటి కుంటలాంటి ప్రదేశంలోకి వెళ్లేలా చేస్తే చాలు.. ఇక నీరు అందులోంచి ఎప్పటికీ వస్తుంటుంది. ఆ కుంటలో నీరు జమ అవుతుంది. దాన్ని మనం వాడుకోవచ్చు. దీనికి ఎలాంటి విద్యుత్ అవసరం ఉండదు. పూర్తిగా సహజ సిద్ధమైన పద్ధతిలో నీటిని తోడుకోవడం అన్నమాట. అందుకనే వీటికి సొరంగం బావులు అని పేరు వచ్చింది.
అయితే సొరంగం బావులంటే తెలియని వారు ప్రస్తుతం చాలా మందే ఉన్నారు. కానీ.. నిజానికి ఒక వృత్తి.. ఈ వృత్తిలో ఉన్నవారు ఇప్పుడు అస్సలు మనకు కనిపించరు. కానీ కేరళలోని ఆ పెద్దాయన గత 50 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాడు. ఆయన తన 14వ ఏట నుంచే సొరంగం బావులను తవ్వడం ప్రారంభించాడు. ఇప్పటికి ఆయన అలా ఏకంగా 1000కి పైగా సొరంగం బావులను తవ్వి ఎన్నో గ్రామాలకు నీటి సమస్యను తీర్చాడు. ఆయనే కేరళకు చెందిన కుంజంబు. వయస్సు 67 ఏళ్లు..
ఉత్తర కేరళ, కర్ణాటక ప్రాంతంలోని అనేక ప్రదేశాల్లో కుంజంబు ఇప్పటి వరకు సుమారు 1వేయికి పైగా సొరంగం బావులను తవ్వాడు. నిత్యం ఒక గునపం, పార, ఒక కొవ్వొత్తిని తీసుకుని పర్వతాల వైపు ఆయన బయల్దేరుతాడు. చెట్లు బాగా దట్టంగా, పచ్చగా ఉన్న చోటును ఎంపిక చేసుకుని గుట్టను సొరంగంలా తవ్వడం మొదలు పెడతాడు. అలా ఒక్కో సొరంగాన్ని రెండున్నర అడుగుల వెడల్పు, 300 మీటర్ల పొడవు చొప్పున తవ్వుతాడు. ఆ దూరంలో నీళ్లు ఊరతాయి. అయితే ఒక్కోసారి తవ్వుతూ లోపలికి వెళ్లే కొద్దీ సొరంగంలో ఆక్సిజన్ ఉండదు. దాన్ని తెలుసుకునేందుకు ఆయన కొవ్వొత్తిని వెలిగిస్తాడు. కొవ్వొత్తి వెలగకపోతే అక్కడ ఆక్సిజన్ లేదని అర్థం. దీంతో ఆయన వెనక్కి వచ్చేసి మరొక చోట నీటి ఊట కనిపించే వరకు లోపలికి సొరంగం తవ్వుతూ వెళ్తాడు.
ఒక సొరంగంలో నీటి ఊట రాగానే దాన్ని అలాగే విడిచిపెడతాడు. దీంతో ఆ నీరు బయటకు ప్రవహిస్తుంది. దాన్ని దారి మళ్లించి ఒక నీటి కుంటలోకి ప్రవహించేలా ఏర్పాటు చేస్తాడు. దీంతో ఆ నీటి కుంటలోకి సొరంగం నుంచి నీరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. అందువల్ల నీటికి ఢోకా ఉండదు. నీటి సమస్య రాదు. దీంతో రైతులు, గ్రామస్తులకు అక్కడ ఇప్పుడు నీటి సమస్య లేదు. ఇక ఈ విధానం పూర్తిగా సహజసిద్ధమైంది.. కనుక సహజ వనరులు దెబ్బ తినవు. అదే బోర్లు అయితే.. కొంత కాలానికి నీరు ఎండిపోవడంతోపాటు.. పర్వతాల సహజ రూపు రేఖలు దెబ్బ తింటాయి. అది మంచిది కాదంటాడు.. కుంజంబు.. తనలా ఈ వృత్తిలో ఉన్నవారు ఇప్పుడు ఎక్కడా లేరని.. అయినప్పటికీ తాను జీవించి ఉన్నంత కాలం ఇలా సొరంగం బావులను తవ్వుతూనే ఉంటానని ఆయన చెబుతారు. అవును మరి.. పర్యావరణంపై ఆయనకున్న అభిమానం అలాంటిది.. అందుకు ఆయన్ను మనమందరం అభినందించాల్సిందే..!