కరోనా భర్త దూరం.. ఆ బాధ నుంచే 88 ఏళ్ల వయసులోనూ పేదలకు సాయం

-

కరోనా వచ్చాకా చాలా మందిలో మార్పులు వచ్చాయి. మానవసంబంధాలు బయటపడ్డాయి. మరుగున పడిన మానవత్వం తెరమీదకు వచ్చింది. తోటివారికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన చాలామందిలో కనిపిస్తుంది. జీవితంలో ఏది శాశ్వతం కాదని మరోసారి స్పష్టమైంది. లక్షల్లో జీతం కొలువైనా.. గడ్డుకాలంలో తోడునిలవలేదు కొందరికి. అయినోళ్లను పోగుట్టుకున్న వాళ్లు ఎందరో. ఆ బాధలోంచి బయటపడేందుకు కొత్త ఆలోచనలు.. అలాంటి ఓ పరిస్థితి నుంచే ఓ బామ్మ తోటివారికి ఏదో ఒకటి చేయాలని పచ్చళ్లు తయారుచేస్తూ.. ఆ లాభాలను పేదలకు అందిస్తోంది.. ఇంత పెద్ద వయసులోనూ.. సేవలందిస్తున్న బామ్మ స్ఫూర్తి కథనం పూర్తిగా మీకోసం.

ఉషాగుప్తా వయసు 88. గతేడాది కరోనా రావడంతో ఉషాగుప్తా, ఆమె భర్త రాజ్‌ కుమార్‌ ఆసుపత్రిలో చేరారు. రెండువారాలున్నా చికిత్స ఫలించక భర్త చనపోయారు. కొవిడ్‌ను గెలిచి ఉష ఇంటికి చేరుకున్నారు. భర్తను కోల్పోయిన వేదన ఆమెను విపరీతంగా కుంగదీసింది. అదే సమయంలో ఎందరో పేదలు ఈ వైరస్‌కు గురవడంతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులెదుర్కోవడం ఆమెను ఎంతగానో కలిచివేసింది. ఆ విపత్కర సమయంలో అందరూ తమకు చేతనైన సాయం చేయడాన్ని గమనించారు. తనూ ఏదైనా చేయాలనుకున్నారు.

దిల్లీలో ఉంటున్న ఉషాగుప్తా… పచ్చళ్లు పెట్టడంలో ఈమెకు మంచి పేరుంది. రుచికరమైన పచ్చళ్ల తయారీనే వ్యాపారంగా ఎందుకు మలచకూడదని ఆలోచించారీమె. మనవరాలు డాక్టర్‌ రాధికతో చర్చించారు. ఉష ఆలోచన ఇంట్లో అందరికీ నచ్చింది. అలా వారి ప్రోత్సాహంతో ‘పికిల్డ్‌ విత్‌ లవ్‌’ ప్రారంభించింది.. రకరకాల ఊరగాయలు, రోటి పచ్చళ్లు చేయడం మొదలుపెట్టి, వాటిని ముందుగా తెలిసినవాళ్లకు అందజేశారు. అలా విక్రయించగా వచ్చే నిధులను పేదల సంక్షేమానికి వినియోగించడానికి అని వాళ్లందరితో చెప్పే వారు. దాంతో అందరూ ఆసక్తిగా కొనుగోలు చేస్తూ ఉష ఆలోచనకు తమ వంతు సహకారాన్నివ్వడం మొదలు పెట్టారు. కట్ చేస్తే..సోషల్‌మీడియాలో ఉష పచ్చళ్ల రుచి అందరికీ తెలిసింది. దాంతో విక్రయాలు పెరిగాయి. అలా వచ్చే ఆదాయాన్ని కొవిడ్‌ బాధిత పేద కుటుంబాలకు విరాళంగా ఇచ్చేవారు ఈ బామ్మగారు.

ప్రారంభించిన నెలలోపే తాను తయారుచేసిన పచ్చళ్లకు ఆర్డర్లు రావడం మొదలయ్యాయట. కరోనా వల్ల తనలో కూడా శక్తిలేదు.. అయినా ఏదో ఒకటి చేయాలనే తపన ముందు తన వయసు, శక్తి వంటివేమీ గుర్తు రాలేదంటోది మన బామ్మ.. అలా ప్రారంభించిన ఈ చిరు వ్యాపారం అతి తక్కువ రోజుల్లోనే విజయవంతమైంది. మొదటి నెలలో 200 ఆర్డర్లు వచ్చాయి. పచ్చళ్ల తయారీతోపాటు పలురకాల మసాలాలను కూడా చేయడం మొదలుపెట్టారు..

తాజా కూర గాయలు, పచ్చళ్ల దినుసుల ఎంపికలో నాణ్యత, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేయడం… ఇలా ప్రతి అంశంపైనా శ్రద్ధ పెట్టేవారట.. అందుకే వీటిని రుచి చూసిన వాళ్లు మళ్లీ మళ్లీ కొంటున్నారు. పచ్చళ్లను నింపే సీసాలు, లేబుల్స్‌ అన్నీ మా మనవరాలు చూసుకుంటుంది అంటున్నారు ఉషా.

భర్త ఇప్పుడు తనతో లేకపోయినా.. ఈ సాయంలో ఆయన కూడా నా వెంటే ఉన్నారని మనసుకు అనిపిస్తుందని బామ్మ ఎంతో సంతోషంగా చెప్తున్నారు.. గతేడాది నుంచి చూస్తే ఆర్డర్లు రెట్టింపు అవడంతో… వీటిద్వారా వచ్చే లాభాల్ని పేదల కోసం పనిచేసే ఎన్జీవోలకు విరాళంగా అందిస్తున్నారట.. అలాగే రోడ్ల మీద ఉండే నిర్వాసితులకూ ఆహారాన్ని అందేలా ఏర్పాటు చేస్తున్నారట. ఏడాదిన్నరలో దాదాపు 65 వేలమంది ఆకలి తీర్చగలిగా. రూ.2 లక్షలకు పైగా నగదును విరాళంగా అందించామని ఉషాగుప్త తెలిపారు. మనసుకు నచ్చిన పని చేయాలి. అయితే అది వెంటనే పక్కాగా చేసాయాలి అని భర్త ఎప్పుడు చెప్పే మాటలను ఉషా ఆచరణలో పెట్టి.. ఎంతోమంది ఆకలి తీర్చుతున్నారు. ఈ కథ మన యంగ్ జనరేషన్ కు చాలా స్పూర్తిదాయకమే కదా..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version