ట్రాన్స్‌జెండర్లు అంటే సమాజంలో వారిపై ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. వారు నిత్యం అవమానాలకు, వివక్షకు గురవుతుంటారు. హేళనలు, ఎగతాళి, బెదిరింపులను ఎదుర్కొంటుంటారు. దీంతో కొందరు కొన్ని గ్రూపులుగా ఏర్పడి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. అయితే ట్రాన్స్‌జెండర్లు కూడా మనుషులేనని, వారిలోనూ ప్రతిభ దాగి ఉంటుందని, అవకాశం ఇస్తే వారు కూడా రాణిస్తారని కొందరు ట్రాన్స్‌జెండర్లు నిరూపించారు. అలాంటి వారికే ఇప్పుడు ఛత్తీస్‌గడ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్స్‌గా అవకాశం లభించింది. వారిని కానిస్టేబుల్స్‌గా నియమించారు.
2017-18వ సంవత్సరంలో ఛత్తీస్‌గడ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం రాత పరీక్ష నిర్వహించగా దానికి సంబంధించిన ఫలితాలు ఇటీవలే మార్చి 1న విడుదలయ్యాయి. ఇప్పటికే దాదాపుగా 4 ఏళ్లు ఆలస్యం అయ్యింది. అయినప్పటికీ ఎట్టకేలకు వారిలో 13 మంది ట్రాన్స్‌జెండర్లు రాత పరీక్షలో పాసై ఫిజికల్ టెస్టులో అర్హత సాధించి కానిస్టేబుల్స్‌గా నియామకం అయ్యారు. మరో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు.
ఎన్నో అవమానాలు, వివక్షలను ఎదుర్కొన్న తాము పోలీస్ కానిస్టేబుల్స్ గా నియామకం అవడం పట్ల ఆనందంగా ఉందని ఆ ట్రాన్స్‌జెండర్లు తెలిపారు. తాము కానిస్టేబుల్ పరీక్షకు 3 లింగంగా పేర్కొంటూ దరఖాస్తు చేస్తే ఇంట్లో వాళ్లే తిట్టి కొట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తాము ఏంటో, తమ సత్తా ఏంటో ఇప్పుడు నిరూపించుకున్నామని, తమలో దాగి ఉన్న ప్రతిభ ఏమిటో ఇప్పుడు తమ కుటుంబ సభ్యులతోపాటు తమను అవమానాలకు గురి చేసిన వారికి కూడా తెలుస్తుందని.. ఆ ట్రాన్స్‌జెండర్లు తెలిపారు. కానిస్టేబుల్స్‌గా ఎంపికవడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇక వారు ఇతర ట్రాన్స్‌జెండర్లకు ఆదర్శంగా నిలుస్తారని అక్కడి పోలీసు అధికారులు తెలిపారు.