ప్రపంచం మొత్తం గాలి పీల్చు కోవడానికి ఇబ్బంది పడుతుందనే విషయం మన అందరికి తెలిసిందే. ప్రతి రోజు పెరిగిపోతున్న కాలుష్యం ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అనేది వాస్తవం. ఎంత మంది ఎన్ని రకాలుగా ఆందోళన వ్యక్తం చేసినా మనుషుల్లో మాత్రం ఏ మార్పు రావడం లేదు. తాజాగా ప్రపంచాన్ని హెచ్చరిస్తూ ఒక బాలుడు ఏకంగా ఒక పాటనే విడుదల చేసాడు. గాలి పీల్చుకోవడానికి చెట్లు ఎక్కండి అంటూ అతను పాడిన పాట ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. యుకెలోని ఫ్లీట్‌కు చెందిన ఫ్రాంకీ మోర్లాండ్ అనే 8 ఏళ్ల బాలుడు…
ఇటీవల తన యుట్యూబ్ ఛానల్ లో ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న వాతావరణ మార్పుల గురించి ఒక పాట విడుదల చేసాడు. ‘వరల్డ్ ఇన్ డేంజర్’ అనే పాటలోని లిరిక్స్ నాశనమవుతున్న భూగ్రహం గురించి ఆలోచింపజేసేలా ఉంది. ఈ పాటను రికార్డ్ చేయడానికి గానూ తన పాఠశాల గాయక బృందం సహాయం తీసుకున్న ఫ్రాంకీ… మనం అందరం కలిసి ప్రపంచాన్ని చూసుకోవాలని కోరుకున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇక ఈ పాటలో లిరిక్స్ తో పాటు చిత్రీకరించిన దృశ్యాలు కూడా హృదయవిదారకంగా ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి.
ముఖ్యంగా అతని పాటలో… “చెట్లు ఎక్కి గాలి పీల్చుకోండి, అందరూ ప్రపంచాన్ని ఆస్వాదించండి ఎందుకంటే రేపు చాలా భిన్నమైన రోజు కావచ్చు.” అంటూ పాడిన లిరిక్స్ ఆకట్టుకుంది. అతను… తనకు నాలుగేళ్లు వయసు ఉన్నప్పటి నుంచి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ నిధులు సేకరించే పనిలో పడ్డాడు. ఇక ఇప్పుడు తాను పాడిన పాటతో వచ్చిన లాభాలను… పర్యావరణం కాపాడుకోవడం కోసం ఇవ్వనున్నాడు. ఈ పాట డిసెంబర్ 13, 2019 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. ట్విట్టర్ లో ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది.