యూట్యూబ్ ద్వారా నెలకు 2 లక్షలు సంపాదిస్తున్న హర్యానా యువరైతు

సాధారణంగా రైతులు వ్యవసాయం చేసి డబ్బులు సంపాదిస్తారు. కానీ.. హర్యానాకు చెందిన ఈ యువ రైతు మాత్రం కేవలం యూట్యూబ్ ద్వారానే నెలకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. షాకయ్యారా? నోరెళ్లబెట్టారా? పదండి… ఆయన అంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాడో తెలుసుకుందాం.


దర్శన్ సింగ్. ఊరు హర్యానా. తండ్రి సంపాదించిన 12 ఎకరాల వ్యవసాయం ఉంది. పేరుకు 12 ఎకరాలు ఉన్నా వచ్చే ఆదాయం మాత్రం అంతంత మాత్రమే. దీంతో… దర్శన్ కూడా వ్యవసాయం చేయాలనుకున్నాడు. 2015 వరకు ఓవైపు చదువుతూనే మరోవైపు వ్యవసాయం పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు.

తన చదువు పూర్తయింది. ఇక.. వ్యవసాయంపై దృష్టి పెట్టాలి. కానీ.. అంతంతమాత్రం ఆదాయం. ఏం చేయాలి. ఏదైనా కొత్తగా చేయాలి. ఆసమయంలో అందరూ కెమికల్ ఫార్మింగ్ వైపు వెళ్లినా.. దర్శన్ మాత్రం సహజసిద్ధంగా వ్యవసాయం చేయాలనుకున్నాడు. దాని కోసం రెండు ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సహజ సిద్ధంగా పంటను పండించి చూశాడు. కానీ.. అంతగా అది వర్కవుట్ కాలేదు. ఫ్యామిలీని పోషించడం దర్శన్ బాధ్యతగా మారింది.

దీంతో 2017లో డెయిరీ ఫామ్ పెడదామనుకున్నాడు. కానీ.. కొత్త కదా. అన్నీ అవాంతరాలే. సరే.. ఆన్ లైన్ లో ఏవైనా సలహాలు దొరుకుతాయేమోనని యూట్యూబ్ అంతా వెతికాడు. అంతా తప్పుడు సమాచారం, వ్యూస్ కోసం తయారు చేసిన వీడియోలే కనిపించాయి. నిజమైన వీడియోలేవీ దర్శన్ కు కనిపించలేదు.
ఇలా అయితే కుదరదు అనుకున్నాడు దర్శన్. వెంటనే హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు తిరిగాడు. సహజసిద్ధంగా పంటలు పండించి లాభాలు గడిస్తున్న రైతులను కలిశాడు. వాళ్ల నుంచి ఎంతో నేర్చుకున్నాడు. అయితే… వ్యవసాయానికి సంబంధించి ఏదైనా సమాచారం కావాలంటే ఇలా రైతులను కలిసి అడగడమేనా? దీనికి వేరే దారి లేదా అని ఆలోచించాడు. అందరూ ఇలా రాష్ట్రాలు తిరిగి వ్యవసాయానికి సంబంధించి నేర్చుకోలేరు కదా. వ్యవసాయానికి సంబంధించి నిజమైన సలహాలు, సూచనలను అందరికీ అందుబాటులో ఉంచితే ఎలా ఉంటుంది అనే ఐడియా తట్టింది దర్శన్ కు. అంతే.. వెంటనే తను కలిసిన రైతుల వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడం ప్రారంభించాడు. అలా పుట్టుకొచ్చిందే ఫార్మింగ్ లీడర్ అనే యూట్యూబ్ చానెల్.
నేను చాలా వీడియోలను నా ఫోన్ లోనే చిత్రీకరించేవాడిని. నా చానెల్ కు వస్తున్న స్పందన చూసి వెంటనే మంచి కెమరా కొని వీడియోలు తీయడం ప్రారంభించా. యూట్యూబ్ చానెల్ ప్రారంభించిన ఆరు నెలల్లోనే లక్షల మంది నా చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. అలాగే యూట్యూబ్ నుంచి కొంత ఆదాయం కూడా రావడం ప్రారంభం అయింది. నేను ఎంతో కష్టపడి వ్యవసాయం చేసినా రాని ఆదాయం.. యూట్యూబ్ ద్వారా వస్తుండటంతో నాకు ఎందుకో దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలనిపించింది. దీంతో రైతులకు ఉపయోగపడే వీడియోలను చేయడం ఎక్కువ చేశాను. అలా.. యూట్యూబ్ లో కనీసం వారానికి 4 నుంచి 5 వీడియోలు పోస్ట్ చేస్తుంటా. మరోవైపు వ్యవసాయం కూడా చేస్తుంటా. వ్యవసాయంలో ఎవరైనా సరికొత్త మార్పులు తీసుకొచ్చినా… వినూత్న పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నా.. నేను వెంటనే ఆ రైతుల వద్దకు వెళ్లి వీడియో తీసి అందరు రైతులకు చేరేలా చేస్తా. నా వీడియోలు నచ్చి ఇప్పటికే 20 లక్షలకు పైగా నా చానెల్ కు సబ్ స్క్రైబ్ అయ్యారు. నెలకు 2 లక్షల వరకు ఆదాయం వస్తోంది.. అంటూ తన యూట్యూబ్ ప్రస్థానాన్ని చెప్పకొచ్చాడు దర్శన్.