వరల్డ్ టాప్ యూనివర్సిటీల్లో ఐఐటీ రోపర్!!

-

వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ఐఐటీ రోపర్ టాప్‌లో నిలిచింది. వివరాల్లోకి వెళితే…సెప్టెంబర్ 11న టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2020ని విడుదల చేసింది. ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో 56 భారతీయ సంస్థలలో ఐఐటీ రోపర్ మొదటి స్థానంలో నిలిచింది.

ఈ సంస్థతోపాటు బెంగళూరులోని ఐఐఎస్సీ కూడా టాప్‌లో నిలిచింది. ఈ సంస్థ 2014 నుంచి దేశంలోని విద్యాసంస్థల్లో టాప్‌గా ఉంటుంది. ఇక రోపర్ విషయానికి వస్తే ఐఐటి రోపర్ 2008లో ప్రారంభించారు. దేశంలోని కొత్త ఐఐటిలలో ఒకటి. ఐఐటి బొంబాయి, ఐఐటీ ఢిల్ల్లీ కంటే ఉన్నత స్థానంలో ఉంది. అంతేకాకుండా మరో ప్రఖ్యాత విద్యాసంస్థ అయిన ఐఐఎస్సీ బెంగళూరుతో భుజం భుజాన నిలబడటం గమనార్హం. భారతదేశంలోని ఉత్తమ సంస్థలుగా ఉన్న ఈ రెండు ప్రపంచంలోని టాప్ 301-350 విశ్వవిద్యాలయాలలో నిలిచాయి.

ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2020 లో టాప్ 300 లో భారతీయ సంస్థ లేదు. గత సంవత్సరం, ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో మొదటి 500 స్థానాల్లో ఐదు భారతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ఆరు భారతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.

2012 నుంచి ఇప్పటి వరకు దేశంలోని ఏ విద్యాసంస్థ కూడా టాప్ 300లో స్థానం దక్కించుకోకపోవడం విచారకరం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇండియన్ టాప్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఐఐటీ ఇండోర్ రెండోస్థానంలో నిలబడింది. ఈ సంస్థ కూడా 2008లోనే ప్రారంభం కావడం గమనార్హం. ఐఐటీ బాంబే, ఢిల్లీ, ఖరగ్‌పూర్‌లు టాప్ 401-500 ర్యాంకుల్లో ఉన్నాయి. 601-800 స్థానాల జాబితాలో జామియా మిల్లియా ఇస్లామియా, జేఎన్‌యూ, పంజాబ్ యూనివర్సిటీ, సావిత్రిబాయిఫూలే, థాపర్, శిక్షా ఓ అనుసంధాన్, కేఐఐటీలు స్థానాన్ని సంపాదించాయి.

ప్రపంచంలో టాప్ ర్యాంకింగ్ విద్యాసంస్థలు ఇవే!
2020 వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ యూనివర్సిటీ వరుసగా నాల్గోసారి ప్రథమస్థానంలో నిలిచింది.
రెండోస్థానంలో – కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మూడోస్థానంలో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, తర్వాతి స్థానాల్లో స్టాన్‌ఫోర్డ్, యేల్, హార్వార్డ్, ఇంపీరియల్ కాలేజీ లండన్ దక్కించుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news