ఒంటి కన్ను అమ్మ లోకాన్ని చూపించింది.. హృదయానికి హత్తుకునే కథ

మా అమ్మ రోజూ కూరగాయలు అమ్ముతూ నాకు చదువు చెప్పించేది. మానాన్న నా చిన్నప్పుడే కాలం చేశారు. కానీ మా అమ్మను చూస్తే నాకు చిరాకు, అసహ్యం వేసేది. ఎందుకంటే మా అమ్మకు ఒక కన్ను మాత్రమే ఉండేది. చూడటానికి నాకస్సలు ఇష్టం అనిపించేది కాదు. ఉదయం లేవగానే ఆ మహా తల్లి ముఖమే కనిపించేది. నాకు కోపం వచ్చేది.. నాకు కనపడకు అంటూకేకలు వేసేవాన్ని.. ఒకరోజు అలా అరిచి బాక్స్‌ నేలకు కొట్టి, ఆమె ఇచ్చిన పది రూపాయలు తీసుకొని స్కూలుకు వెళ్ళిపోయా…

మద్యాహ్నం స్కూల్‌ ఆయా వచ్చి పిలిచి నీకోసం ఎవరో వచ్చారని చెప్పింది. వెళ్ళి చూస్తే మా అమ్మ టిఫిన్‌ బాక్స్‌ తీసుకొని వచ్చింది. ఇక్కడికెందుకొచ్చావ్‌ అంటూ తిట్టి వెళ్ళగొట్టేశా.. కానీ మా ఫ్రెండ్స్‌ అందరూ మా అమ్మని చూశారు.. నన్ను హేళన చేశారు. మీ అమ్మకు ఒక్కటే కన్ను అంటూ వెక్కింరిచారు. ఇలా ఆవిడ ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే..

సాయంత్రం ఇంటికి వచ్చాక మా అమ్మను తిట్టా “అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను.. నీ వల్ల స్కూల్లో కూడా అనుభవిస్తున్నాను.. నువ్వు చచ్చిపో! అంటూ అరిచా.. ఏమీ అనకుండా అలా ఉండిపోయేది. తిరిగి ఒక్క మాట కూడా అనేది కాదు… అసలు ఈమె కడుపులో ఎందుకు పుట్టానా అనుకుంటూ.. మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను.

మధ్య రాత్రి దాహం వేసి నిద్రలేచి నీళ్ళు తాగుదామని కుండ దగ్గరిపోయా.. అక్కడ అమ్మ ఏడుస్తూ కూర్చుంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు అని తిట్టుకుంటూ వెళ్ళి పడుకున్నా..

నేను చాలా కష్టపడి చదివాను పై చదువుల కోసం ఆ అమ్మను వదిలి పట్నం వచ్చాను. మంచి విశ్వ విద్యాలయం లో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను బాగా డబ్బు సంపాదించాను, మంచి ఇల్లు, భార్య, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడిచిపోతుంది.. అప్పుడప్పుడూ మా అమ్మ గుర్తుకొచ్చేది.. హమ్మయ్యా తను లేదు అనుకుంటూ హ్యాపీగా ఉండేవాన్ని.

ఒక రోజు ఉన్నట్టుండి ఆ మహా తల్లి నా ఇంటి ముందు కనిపించింది. ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయపడింది.
“ఎవరు నువ్వు?
ఎందుకొచ్చావిక్కడికి?
నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?
ముందునువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!” అంటూ సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను.

“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను” అంటూ ఆమె వెళ్ళిపోయింది. వీధి చివరి వరకు వెళ్ళి చూశా హమ్మయ్యా వెళ్ళిపోయింది.

ఒక రోజు మా చిన్న నాటి స్నేహితులందరూ పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటూ మా స్కూల్లో ఏర్పాటు చేశారు. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశా.. మా అమ్మ అలా పడి ఉంది. ఆమె చేతిలో ఒక కాగితం ఉంది. అది నాకోసమే రాసిపెట్టింది. పిల్లలతో రాయించినట్లుంది.

image credits to AP Photo/Saurabh Das

దాని సారాంశం..
కన్నా,, ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను, నేను ఇక నువ్వు ఉండే దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా!

ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకున్నాను.. కన్నపేగురా.. తట్టుకోలేక పోతోంది. కళ్ళల్లో తడి మొదలైంది నాకు.
నువ్వు స్కూల్‌కి వస్తున్నావని తెలిసి నిన్ను చూడాలన్న నా ఆనందానికి అవదుల్లేవు.. కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే
వస్తే నీకు మళ్ళీ అవమానం చేసిన దాన్నవుతాను,,

ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు..

నీ చిన్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా! నిన్ను అందరూ ఏడిపిస్తారని బాధ పడ్డా నాన్న.. అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను..

నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా?

నువ్వు నన్ను తిట్టినా బాధ అనిపించినా.. ”వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనే కదా!”వ
అని సరిపెట్టుకున్నాను.. ప్రతీ రోజు నువ్వు గుర్తుకు వస్తావు నాన్న.. నువ్వు చిన్నప్పుడు చేసిన అల్లరి గుర్తులు నా మనసులో శాశ్వతం రా కన్నా..

ఉత్తరం తడిసి ముద్దయింది.. కన్నీటి ధార.. అమ్మా, అమ్మా అందామన్నా నోరు పెకలట్లేదు.. నాకు ప్రపంచం కనిపించడం లేదు..

మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి? తన జీవితం అంతా నాకోసం ధారపోసిన మా అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తితే ఆమె ఋణం తీర్చుకోగలను ?

(ఇది నా స్టోరీ కాదు.. ఇది ఇంగ్లీష్ కథకు అనువాదం)

-RK

తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ.. అటు వంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి..

కనుపాపలా కాపాడండి.. ఒక్కసారి ఆలోచించండి.. అమ్మ కోసం ఒక జన్మ సరిపోదు.. కానీ మదర్స్‌డే రోజైనా మరవకుండా అమ్మకు పాదాభివందనం చేద్దాం.. నలుగురికీ ఇలాంటి సందేశాలుపంపండి..