కొన్ని అలవాట్లు మన జీవితాలని మార్చేస్తాయి. అలాగే మరికొన్ని అలవాట్లు మనల్ని విజయ తీరాలకి దూరంగా పడవేస్తాయి. ఇంకొన్ని అలవాట్లు విజయ సంద్రంలో నిత్యం తడిచేలా చేస్తాయి. ఏది కావాలన్నా మనం చేసే పనుల మీదే ఆధారపడి ఉంటుంది. మీకు ఉపయోగపడే అలవాట్లు నేర్చుకోకుండా మీకు తాత్కాలికంగా ఆనందాన్నిచ్చే అలవాట్లని అలవర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. జీవితం చివరి దశలో ఉన్నప్పుడు, నాకిలాంటి అలవాటు లేకుండా ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు అని బాధపడకుండా ఉండడానికి ఇప్పుడే అలవాటు చేసుకోవాల్సిన కొన్నింటిని గూర్చి తెలుసుకుందాం.
మూర్ఖులతో వాదించవద్దు.
అవును, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. అవతలి వాడు దాన్ని ఖరాకండిగా కొట్టిపడేస్తుండవచ్చు. వివరించే ప్రయత్నం చేసినా వినకుండా తాను పట్టుకున్న కుందేలుకి మూడేకాళ్ళని వితండవాదం చేస్తుండవచ్చు. అలాంటివారికి వారి మానాన వదిలేయడమే ఉత్తమం. వారి మీద గెలవడానికి మీరు కూడా మూర్ఖులుగా మారాల్సిన అవసరం లేదు. కాబట్టి, మూర్ఖులతో వాదన పెట్టుకోవద్దు.
పుకార్ల ప్రచారంలో పాల్గొనవద్దు
అసలేం జరిగిందో తెలియకుండా అవతలి వారు మీకు చెప్పారు కదా అని చెప్పి, అది నిజమని మీరు నమ్మి, దాన్ని మరొకరు నిజం అనుకునేలా చేసి, అలా అలా అందరికీ వ్యాపింపజేయాలని చూడవద్దు. మీ గురించి కూడా ఇలాంటి ప్రచారాలే జరిగితే మీరెలా ఫీలవుతారో ఆలోచించుకోండి. అన్నింటికంటే ముఖ్యంగా అవతలి వారి గురించి మరీ ఎక్కువగా ఆలోచించవద్దు.
ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు
కోపంలో ఉన్నప్పుడు మనమేం ఆలోచిస్తామో మనకే తెలియదు. అలాంటి టైమ్ లో తీసుకునే నిర్ణయాలు అంత బాగా ఉండవు. అందుకే ఆవేశం వచ్చినపుడు నిర్ణయాలు తీసుకోవద్దు.
కోపంగా ఉన్నప్పుడు నిద్రపోవాలని ప్రయత్నించవద్దు
కోపంతో నిద్రపోవాలని ప్రయత్నం చేస్తే నిద్రపట్టదని గుర్తుంచుకోండి. మీకు నచ్చిన వారితో గొడవ జరిగి, కోపంతో అలాగే నిద్రపోవాలని చూడవద్దు. దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.