అవును.. ఆయన కలెక్టర్. కాకపోతే అందరు కలెక్టర్లలా కాదు. చాలా డిఫరెంట్. మనం ఆఫీసుకు వెళ్లేటప్పుడు బాక్స్ తీసుకెళ్తాం కదా. కానీ.. ఈయన తీసుకెళ్లడు. అలా అని హోటళ్ల నుంచి పార్శిళ్లు కూడా తెచ్చుకోడు. ఎక్కడ తింటాడో తెలుసా? రండి.. ఆయన గురించి తెలుసుకోవడానికి మనం కేరళ వెళ్లాల్సిందే.
అలప్పూజా జిల్లా కలెక్టర్ ఎస్ సుహాన్. 2012 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆఫీసర్. అలప్పూజ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే స్కూల్ ఎడ్యుకేషన్ పై సుహాన్ దృష్టి పెట్టారు. దృష్టి పెట్టడమంటే ఏదో అధికారులను పిలిచి స్కూళ్లలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి.. విద్యార్థులకు మౌలిక వసతులు ఎలా ఉన్నాయి.. అంటూ రెండు ముక్కలు అడిగి… అంతటితో తన పనైపోయిందనుకునే టైపు కలెక్టర్ కాదాయన. అదే ఆయన స్పెషాలిటీ.
అలప్పూజలో కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం అక్కడ ఏదో ఒక స్కూల్ కు వెళతాడు. అక్కడ పిల్లల మధ్య కూర్చొని మధ్యాహ్నం భోజనం తింటాడు. పిల్లలతో కలిసి తింటాడు. పిల్లలతో ముచ్చటిస్తూ తింటాడు. భోజనం ఎలా ఉంది.. సౌకర్యాలు ఎలా ఉన్నాయి.. అంటూ విద్యార్థులను అడుగుతాడు. భోజనం బాగోలేదని పిల్లలు చెబితే.. వెంటనే అక్కడికక్కడే చర్యలు తీసుకుంటాడు. అది ఆయన లంచ్ టైమ్ లో చేసే పని. ఆయన నార్మల్ వర్క్ తో పాటు ఇలా లంచ్ టైమ్ లో వివిధ పాఠశాలలను సందర్శించడం… పిల్లలతో కలిసి భోంచేయడం… అది ఇప్పుడే కాదు.. ఆయన ఇదివరకు వయనాడ్ జిల్లా కలెక్టర్ గా చేసినప్పుడు కూడా అలాగే చేసేవాడు.
దీంతో ఆయన ఏ జిల్లాలో కలెక్టర్ గా ఉంటే ఆ జిల్లా ప్రభుత్వ స్కూళ్ల అధికారులు వణికిపోవాల్సిందే. ఎప్పుడు ఏ స్కూల్ కు వెళ్తాడో తెలియదు కదా. ఏ స్కూల్ లో మధ్యాహ్న భోజనం చేస్తాడో తెలియదు. దీంతో ఆటోమెటిక్ గా స్కూళ్లలో విద్యార్థులకు మంచి భోజనం పెట్టడం, విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు పెంచడం చేశారు అధికారులు. దీంతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందట. వావ్.. కలెక్టర్ సాబ్.. నువ్వు గ్రేట్ పో. నీలాంటోళ్లు ఇంకో పది ముంది ఉంటే ఈ దేశం అభివృద్ధిలో ఎందుకు పరుగులు పెట్టదు.