చెన్నైలోని బసంత్ నగర్‌లో ఉన్న ఎలియట్స్ బీచ్ ఫుట్‌పాత్‌పై కొందరు యువకులు మార్చి 29వ తేదీన బర్త్ డే పార్టీ చేసుకున్నారు. అనంతరం కేకులను తిని చెత్తను అక్కడే పారేశారు.
మనం కేవలం మన ఇంటినే కాదు, మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త వేయకూడదు. అలాగే చెత్త వేసేవారికి అవగాహన కల్పించాలి. చెత్త వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో, దాని వల్ల పర్యావరణం ఎలా దెబ్బ తింటుందో తెలియజేయాలి. అప్పుడే ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం వస్తుంది. తద్వారా మన కాలనీ, మన ఊరు, మన నగరం అన్నీ శుభ్రంగా ఉంటాయి. సరిగ్గా ఇలా ఆలోచించాడు కాబట్టే.. ఆ పోలీస్ కానిస్టేబుల్ చాలా తెలివిగా వ్యవహరించాడు. బీచ్‌లో పార్టీ చేసుకుని చెత్తను పారవేసి వెళ్లిన కొందరు యువకులకు అతను గట్టిగా బుద్ధి చెప్పాడు. ఇంతకీ అసలు జరిగిన విషయం ఏమిటంటే…
చెన్నైలోని బసంత్ నగర్‌లో ఉన్న ఎలియట్స్ బీచ్ ఫుట్‌పాత్‌పై కొందరు యువకులు మార్చి 29వ తేదీన బర్త్ డే పార్టీ చేసుకున్నారు. అనంతరం కేకులను తిని చెత్తను అక్కడే పారేశారు. కేకులు తెచ్చుకున్న కార్డుబోర్డు బాక్స్‌లను అక్కడ పడేశారు. దీంతో అక్కడ వాకింగ్ చేసే వారికి చాలా ఇబ్బంది కలిగింది. దాన్ని గమనించిన అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్డేబుల్ ఎబిన్ క్రిస్టొఫర్ సదరు కార్డు బోర్డు బాక్స్‌లపై ఉన్న బేకరీకి ఫోన్ చేసి ఆ యువకుల ఫోన్ నంబర్లను తీసుకున్నాడు. వెంటనే అతను ఆ యువకులకు కాల్ చేసి బీచ్‌కు రమ్మని చెప్పాడు.
బీచ్‌కు వచ్చిన ఆ యువకులు క్రిస్టొఫర్‌ను చూసి మొదట భయపడ్డారు. అతను తమపై పోలీస్ కేసు పెడతాడేమోనని వారు ఆందోళన చెందారు. అయితే క్రిస్టొఫర్ అలా చేయలేదు. కానీ.. బీచ్ ఫుట్‌పాత్‌లో పడేసిన కార్డు బోర్డు బాక్సు చెత్తను వెంటనే తీసేయాలని క్రిస్టొఫర్ ఆ యువకులకు చెప్పాడు. దీంతో వారు ఆ చెత్తను తొలగించి ఫుట్‌ఫాత్‌ను శుభ్రం చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించి కొందరు ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. అందరూ ఇప్పుడు కానిస్టేబుల్ క్రిస్టొఫర్ చేసిన పనిని అభినందిస్తున్నారు. అవును మరి.. మనం ఉండే పరిసరాల్లో మనమే చెత్త వేస్తే ఎలా..? పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే కదా.. మనం ఆరోగ్యంగా ఉండేది.. ఏది ఏమైనా క్రిస్టొఫర్ చేసిన పనికి అతనికి మనం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఏమంటారు..!