మను భాకర్.. ప్రస్తుతం ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒలింపిక్ మెడల్ సాధించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మను భాకర్ ట్రెండ్ అవుతుంది. ఎయిర్ గన్ షూటింగ్ లో భారతదేశం తరపున ఒలింపిక్స్ ఆడిన క్రీడాకారిణి ఈమె. 2018 ఐఎస్ఎస్ఎఫ్ (ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్) వరల్డ్ కప్‌లో భారతదేశం తరుపున ఆడి రెండు బంగారు పతకాలు సాధించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఆశ్చర్యం ఏమిటంటే అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. చిన్న వయసులో ఆమె సాధించిన విజయాలకి గాను 2020లో భారత ప్రభుత్వం ప్రతిష్ఠతికమైన అర్జున అవార్డుతో మను భాకర్‌ను సత్కరించింది.
2017 కేరళలో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్ షిప్ లో భాకర్ ఏకంగా 9 బంగారు పతకాలు సాధించి జాతీయ రికార్డును బద్దలుకొట్టింది. అదే ఏడాదిలో జరిగిన ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కూడా భాకర్ రజత పతకం కైవసం చేసుకుంది. ఇక 2018 వ సంవత్సరంలో మెక్సికోలోని గ్వాదలహరా సిటీ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్ షూటింగ్ వరల్డ్ కప్ లోని 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోని ఫైనల్స్‌లో రెండుసార్లు ఛాంపియన్ గా నిలచిన అలెజాండ్రా జావ్లాను మను భాకర్ ఓడించింది.. ఈ విజయంతో భాకర్ వరల్డ్ కప్‌లో అతి చిన్న వయసులోనే బంగారు పతకం సాధించిన భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది.
కేవలం 16వ ఏళ్ల వయసులోనే భాకర్ ఈ రికార్డు సాధించడం గొప్ప విషయం. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు వరకు పెద్ద సంఖ్యలో పలు పతకాలని గెలుచుకొని రికార్డులు సృష్టించింది. గతంలో బాగా కష్టపడి కూడా ఒలింపిక్ పతకం గెలవడంలో ఫెయిల్ అయిన మను బాగా డిప్రెస్ అయిపోయింది.ఇక ఆటకు గుడ్‌బై చెప్పి సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకుంది. కానీ సన్నిహితుల ప్రోత్సాహం కారణంగా చివరిసారిగా మళ్లీ ప్రయత్నిద్దాం అనే ఆలోచనతో ఈసారి కూడా అంతే స్థాయిలో కఠోర సాధన చేసి ఏకాగ్రత చెదరకుండా ఒకే లక్ష్యానికి గురి పెట్టింది. దాంతో మళ్ళీ మెరుగైన ఫలితాలు సాధించింది.
జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో స్వర్ణం, వరల్డ్ కప్‌లలో రెండు కాంస్యాలు ఇంకా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, కాంస్యాలు గెలిచింది. ఇలా ఏకాగ్రతతో కష్టపడుతూ కేవలం 22 ఏళ్ల వయసులో మనూ భాకర్ ఇప్పుడు ఒలింపిక్ పతక విజేతగా తానేంటో నిరూపించుకుంది. గత ఒలింపిక్స్ చేదు జ్ఞాపకాలను చెరిపేసింది. తన పట్టుదలతో కేవలం 22 ఏళ్లకే కోటీశ్వరాలైంది.మను భాకర్ నికర విలువ, టోర్నమెంట్ల నుంచి వచ్చిన డబ్బు, ప్రైజ్ మనీ, ఎండార్స్‌మెంట్లు, స్పాన్సర్‌షిప్‌లతో కలిపి మొత్తం రూ.12 కోట్లు సంపాదించింది.