వందల కోట్ల రూపాయల లాటరీ తగిలితే మీరేం చేస్తారు ? ఖరీదైన ఇల్లు, కార్లు, ఆభరణాలు, ఆస్తులు కొంటారు. మిగిలిన సొమ్ముతో వ్యాపారం చేయడమో, ఎందులో అయినా పెట్టుబడి పెట్టడమో చేస్తారు. అంతేకదా.. కానీ ఆ జంట మాత్రం తమకు అంత పెద్ద మొత్తం సొమ్ము లాటరీలో తగిలినా వారు ఆడంబరాలకు పోలేదు. సెకండ్ హ్యాడ్ కారును కొన్నారు. ఇక తమకు వచ్చిన సొమ్ములో సగం మొత్తాన్ని తమ బంధువులు, స్నేహితులు, సహాయం అవసరం ఉన్నవారికి పంచేశారు. అవును.. ఇది నిజం..
బ్రిటన్‌కు చెందిన ప్యాట్రిక్, ఫ్రాంకోయిస్ కానాలీ అనే దంపతులకు ఇటీవల లాటరీలో 115 మిలియన్ల యూరోలు (దాదాపుగా రూ.1140 కోట్లు) తగిలాయి. అయితే అంత పెద్ద మొత్తం వచ్చినా వారు ఆడంబరాలను ప్రదర్శించలేదు. ఓ సెకండ్ హ్యాండ్ కార్‌ను కొన్నారు. అలాగే 60 మిలియన్ యూరోలను 175 మందికి పంచారు. అందుకు గాను వారు ఓ లిస్ట్‌ను ప్రిపేర్ చేశారు. అందులో తమ బంధువులు, స్నేహితులు 50 మంది ఉండగా, మిగిలిన వారు పేదలే. సహాయం అవసరం ఉన్నవారే. ఆ మొత్తాన్ని అందరికీ పంచారు.
అంత పెద్ద మొత్తం వచ్చినా వారు అందులో సగం సొమ్మును ఇతరులకు పంచడంతో ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతటి దాతృత్వ గుణాన్ని కలిగి ఉన్నందుకు హ్యాట్సాఫ్ అని నెటిజన్లు వారిని అభినందిస్తున్నారు. తమకు ఆభరణాలు, ఆస్తుల కన్నా ఇతరుల కళ్లలో ఆనందాన్ని చూడడమే సంతృప్తినిస్తుందని ఆ దంపతులు తెలిపారు.