ఆ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ అత్యాచారానికి గురై చనిపోయిన ఓ బాలిక కుటుంబానికి న్యాయం చేసేందుకు నడుం బిగించింది. ఆ నేరానికి కారణమైన వ్యక్తి మరొక దేశంలో ఉండగా.. అక్కడికి వెళ్లి మరీ ఆమె అతన్ని మన దేశానికి లాక్కొచ్చింది.
నేడు మన దేశంలో నేరగాళ్లు కొత్త పంథాను అవలంబిస్తున్నారు. ఏదో ఒక నేరం చేయడం.. విదేశాలకు పారిపోవడం పరిపాటి అయింది. దీంతో ఆ నేరస్థులను భారత్‌కు రప్పించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో బాధితులకు న్యాయం జరగడం బాగా ఆలస్యమవుతోంది. అయితే ఇదే విషయాన్ని గమనించిన ఆ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ అత్యాచారానికి గురై చనిపోయిన ఓ బాలిక కుటుంబానికి న్యాయం చేసేందుకు నడుం బిగించింది. ఆ నేరానికి కారణమైన వ్యక్తి మరొక దేశంలో ఉండగా.. అక్కడికి వెళ్లి మరీ ఆమె అతన్ని మన దేశానికి లాక్కొచ్చింది. ఇంతకీ అసలు జరిగిన విషయం ఏమిటంటే…
కేరళ రాష్ట్రంలోని కొల్లం అనే ప్రాంతానికి చెందిన సునీల్ కుమార్ భద్రన్ (38) సౌదీ అరేబియాలో ఓ కంపెనీలో టైల్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. అతను 2017లో సెలవు మీద కేరళకు వచ్చాడు. ఆ సమయంలో తన స్నేహితుడి మేనకోడలైన ఓ 13 ఏళ్ల బాలికపై 3 నెలల పాటు అతను అత్యాచారం చేశాడు. ఆ విషయం ఎవరికైనా చెబితే ఆమెను చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక భయపడి ఆ మృగాడి చేష్టలకు మౌనంగా ఉండిపోయింది. ఆ తరువాత సునీల్ సౌదీ వెళ్లిపోయాడు. అయితే అప్పుడు ఆ బాలిక ఎలాగో ఆ విషయం గురించి ఇంట్లో చెప్పగా.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అలా పోలీస్ స్టేషన్లో కేసు నమోద అవ్వగానే ఆ బాలికను ప్రభుత్వ మహిళా మందిరం అనబడే రెస్క్యూ హోంకు తరలించారు. అయితే అక్కడ ఆ బాలిక ఉండలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో ఆ కేసు అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉంది. నిందితుడు సౌదీలో ఉండడంతో అతన్ని ఇక్కడికి రప్పించడానికి ఏం చేయాలో పోలీసులకు అర్థం కాలేదు. అయితే ఇటీవలే కొల్లం పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన మెరిన్ జోసెఫ్ సౌదీకి వెళ్లింది. మరొక దేశంలో ఉన్న నేరస్థులను ఎలా ఇండియాకు తీసుకురావాలో తెలియనప్పటికీ ఆ ప్రొసీజర్ తెలుసుకుని ఆమె సౌదీకి వెళ్లి ఎట్టకేలకు నిందితుడు సునీల్‌ను కేరళకు ఈడ్చుకొచ్చింది. దీంతో అందరూ మెరిన్ జోసెఫ్ ధైర్య సాహసాలను ప్రశంసిస్తున్నారు. అవును.. మరి.. నిజంగా ఇలాంటి ఐపీఎస్ ఆఫీసర్లే కదా మనకు కావల్సింది.. అప్పుడే మన సమాజంలో శాంతి భద్రతలు ఉంటాయి.. అందరికీ రక్షణ లభిస్తుంది..!