ఆ రిసార్ట్‌లో కస్టమర్లు ఆహారం మిగిలిస్తే.. ఫైన్‌ వేస్తారు తెలుసా..!

-

సాధారణంగా మనం హోటల్స్‌, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు అక్కడ సహజంగానే ఎంతో కొంత ఫుడ్‌ను మనం తినకుండా విడిచిపెట్టేస్తుంటాం. దీంతో నిత్యం రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున ఆహార వ్యర్థాలు పోగవుతుంటాయి. అయితే మన దేశంలో కనీసం ఒక పూట తిండికి కూడా నోచుకోని నిరు పేదలు ఎంతో మంది ఉన్న నేపథ్యంలో అలా ఆహారాన్ని వృథా చేయడం వారికి కరెక్ట్‌ కాదనిపించింది. అందుకని ఆ రిసార్ట్‌ వారు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేమిటంటే…

కూర్గ్‌లోని ఇబ్ని స్పా అండ్‌ రిసార్ట్‌ వారు ఇటీవలే ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్కడ రెస్టారెంట్‌లో ఎవరైనా సరే ఆహారాన్ని ప్లేట్లలో విడిచి పెట్టరాదు. పూర్తిగా తినాల్సిందే. లేదంటే విడిచిపెట్టిన ఆహారానికి తూకం వేసి ఆ మేర కస్టమర్లకు వారు ఫైన్‌ వేస్తారు. ఈ క్రమంలో ప్రతి 10 గ్రాముల ఆహార వ్యర్థాలకు వారు ఏకంగా రూ.100 వరకు ఫైన్‌ వేసి కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నారు. అయితే ఆ రిసార్ట్‌ వారు ఈ కార్యక్రమాన్ని ఏదో సరదా కోసం చేయడం లేదు. అనాథ బాలికలకు సహాయం అందించేందుకు గాను వారు ఈ విధంగా ఫైన్‌ను వసూలు చేస్తున్నారు.

స్థానికంగా ఉన్న మడికెరి గర్ల్స్‌ హోంలో చదువుతున్న 60 మంది బాలికలకు సదరు ఫైన్ల ద్వారా వసూలు అయ్యే మొత్తాన్ని ఆ రిసార్ట్‌ అందజేస్తోంది. అయితే మొదట్లో ఆ రిసార్ట్‌లో రోజుకు 14 పెద్ద బ్యాగుల పరిమాణంలో నిత్యం ఆహార వ్యర్థాలు పేరుకుపోయేవి. కానీ అలా ఫైన్లను వసూలు చేయడం మొదలు పెట్టాక క్రమంగా ఆ పరిమాణం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఆ రిసార్ట్‌లో ఆహార వ్యర్థాలు ఎక్కువగా ఉత్పన్నం కావడం లేదు. నిత్యం కేవలం 1 పెద్ద బ్యాగు పరిమాణంలోనే అవి ఉత్పత్తి అవుతున్నాయి. ఇది ఆ రిసార్ట్‌ వారు సాధించిన విజయమని పలువురు కస్టమర్లు కూడా అంటున్నారు. ఏది ఏమైనా.. ఆ రిసార్ట్‌ వారు చేస్తున్న ప్రయత్నాన్ని మనమందరం అభినందించాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version