ప్రకృతి వైపరీత్యాలు సంభవించడానికి కొద్ది క్షణాల ముందు లేదా గంటల ముందు జంతువులు, ముఖ్యంగా మన ఇంటి పెంపుడు జంతువైన కుక్కలు వింతగా ప్రవర్తించడం చాలా మంది చూసే ఉంటారు. ఇవి అరిచేస్తాయి భయంతో దాక్కుంటాయి లేదా ఆందోళనతో ప్రవర్తిస్తాయి. మనుషులకు తెలియని ఈ రాబోయే ప్రమాదాన్ని (Danger) కుక్కలు ఎలా పసిగట్టగలవు? వాటికి నిజంగా ఆరవ ఇంద్రియం (Sixth Sense) ఉందా?
వినికిడి శక్తి (Hearing): మనుషులు వినగలిగే శబ్దాల ఫ్రీక్వెన్సీ కంటే కుక్కలు చాలా తక్కువ మరియు చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉండే శబ్దాలను వినగలవు. భూకంపం వంటి విపత్తులు సంభవించడానికి ముందు, భూమి లోపల ఏర్పడే “ఇన్‌ఫ్రాసౌండ్” అతి తక్కువ పౌనఃపున్యం గల శబ్దాలు మరియు చిన్నపాటి భూ కంపనాలను కుక్కలు ముందుగానే తమ చెవుల ద్వారా పసిగట్టగలవు.

వాసన శక్తి (Smell): కుక్కల వాసన చూసే సామర్థ్యం మనిషి కంటే వేల రెట్లు ఎక్కువ. తుఫానులు లేదా వాతావరణంలో పెద్ద మార్పులు వచ్చినప్పుడు గాలిలో ఏర్పడే రసాయన (Chemical) లేదా ఓజోన్ మార్పులను, లేదా భూమి లోపలి నుండి వెలువడే గ్యాస్‌ల (Gases) వాసనను అవి స్పష్టంగా గుర్తించగలుగుతాయి. మానవ మెదడు ఈ మార్పులను విశ్లేషించలేనప్పటికీ, కుక్కలకు ఇవి స్పష్టమైన ప్రమాద సంకేతాలుగా పనిచేస్తాయి.
సాధారణ ఇంద్రియాలతో పాటు, కుక్కలు వాతావరణ పీడనం (Barometric Pressure) లో వచ్చే సూక్ష్మమైన మార్పులను కూడా చాలా వేగంగా గ్రహిస్తాయి. తుఫానులు లేదా భారీ వర్షం వచ్చే ముందు గాలి పీడనం తగ్గుతుంది. ఈ మార్పులను కుక్కలు తమ చెవుల్లోని ఇంద్రియాల ద్వారా త్వరగా గుర్తించి ఆందోళన పడతాయి.
అంతేకాకుండా భూకంపం వంటి సంఘటనలకు ముందు భూమి నుండి విడుదలయ్యే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ (విద్యుదయస్కాంత) తరంగాల లోని మార్పులను కూడా కుక్కలు పసిగట్టగలవని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ కారణాల వల్ల, కుక్కల అసాధారణ ప్రవర్తన రాబోయే విపత్తులకు ఒక సహజసిద్ధమైన హెచ్చరిక లాగా పనిచేస్తుంది. అందుకే కుక్కలు ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టకలవు.
