కాకులకు చావు ఉండదా..? కర్మకాండలకు, కాకికి ఏంటి సంబంధం?

-

హిందూధర్మం ప్రకారం కాకులను చనిపోయిన వారికి ప్రతీకలు అని బలంగా నమ్ముతారు. పండగ రోజు ఇంటిముందుకు కాకి వచ్చి అరుస్తుంటే చనిపోయిన వారి ఆత్మీయులు వచ్చారని సంబరపడతారు. పిండప్రధానం చేసేప్పుడు కాకిముట్టకపోతే కీడు అని కూడా అంటారు. ఈమధ్యనే వచ్చిన బలగం సినిమా మొత్తం ఈ కాకిచుట్టూనే తిరుగుతుంది. కాకిముట్టకపోతే ఆ కుటంబం ఎంత ఘోషిస్తుందో క్లియర్‌గా చూపిస్తారు. నిజంగానే అలానే జరుగుతుంది. అసలు ఈ లోకంలో ఇన్ని పక్షలు ఉండగా కర్మకాండలకు కాకినే ఎందుకు ఎంచుకున్నారు, కర్మకాండలకు కాకికి సంబంధం ఏంటి..? ఈ డౌట్‌ మీకు ఎప్పుడైనా వచ్చిందా? దానికి సమాధానం ఇదే..!

పురాణాల ప్రకారం

రావణుడికి భయపడిన దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోకి ప్రవేశించారట. తొండలోకి కుబేరుడు, లేడి లోకి ఇంద్రుడు, నెమలిలోకి వరుణుడు, యుముడు కాకిలోకి ప్రవేశిస్తారు. రావణుడు వెళ్లిపోయాక ఆ జంతువుల శరీరంలోంచి బయటకు వచ్చి వాటికి వరమిస్తారు. లేడికి వళ్లంతా కళ్లున్నట్టు అందంగా ఉండే వరం ఇస్తాడు ఇంద్రుడు. వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా ఆడేలా నెమలికి ఫించం ఇచ్చాడు వరుణుడు. కాకికి బలవర్మణం తప్ప స్వతహాగా మరణం ఉండదంటాడు యముడు. ఇక యమలోకంలో నరకం అనుభవించే వారిలో కాకులు ఎవరి పిండం అయితే తింటాయో వారికి ఈ నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాడట. అప్పటి నుంచి పిండాలను కాకులకు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. రామాయణం ప్రకారం.. రాముడు ఒక భక్తుడికి నీ పూర్వికులు కాకి రూపంలో విహరిస్తుంటారు, కాకులకి ఆహారం పెడితే నీ పూర్వికులకి చేరుతుందని ఒక వరం ఇస్తాడు, రాముడి వరం ప్రకారమే నేటికీ కాకులకి ఆహారాన్ని పెడతారనే నానుడి ఉంది.

దీని వెనుకున్న పరమార్థం

పితృకర్మలు, కర్మకాండల సమయంలోనే కాకుండా మిగిలిన సమయంలో కూడా పక్షులకు ఆహారం అందించాలని పెద్దలు అంటారు. అప్పట్లో కాకులు ఎక్కువగా ఉండేవి, పెరట్లోనూ ఎప్పుడూ ఉండేవట. అందుకే పిండాలు కాకులకు పెట్టేవారు.

నీటిలో పిండం వదలడం వెనుక ఉన్న అర్థం

నీటిలో ఉండే జలచరాలకి ఆహారాన్ని పెట్టడం అనేది అందులో ఉన్న పరమార్థం. చాలామంది చనిపోయిన వారి ఆస్థికలని నది దగ్గరికి తీసుకెళ్లి పిండప్రదానం చేసి నదిలో వదిలేస్తారు. ఆస్థికలతో పాటు ఆహారాన్ని కూడా నదిలో వేస్తారు. కొందరు గోవులకు కూడా పెడుతుంటారు. మొత్తంగా హిందూ ధర్మంలో ప్రతి ఆచారం వెనుక సైన్స్‌తో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వాటిని తెలుసుకోవడంలో మనం ఎప్పుడూ వెనకే ఉంటాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version