ఒక వారం నుంచి అందరి నోటా నానుతున్న పదం ఏంటది… ఫొని, దాన్నే కొంతమంది ఫణి అని కూడా రాస్తున్నారు. ఎలా రాసినా అది ఓ తుపాను పేరు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి ఉత్తరాంధ్ర తీరం వైపు దూసుకొస్తున్న తుపాను అది. రేపో, ఎల్లుండో అది ఒడిశా నుంచి చాంద్ బలి, గోపాల్ పూర్ మధ్య తీరం దాటే ప్రమాదం ఉంది.
అయితే.. భారత్‌లో వచ్చిన ఈ తుపానుకు పేరు పెట్టింది బంగ్లాదేశ్. అవును.. అసలు, బంగ్లాదేశ్‌కు ఈ తుపాన్‌కు ఏంటి సంబంధం అని అంటారా? సంబంధం ఏదీ లేదు. కానీ.. ఈ తుపానుకు మాత్రం బంగ్లాదేశే పేరు పెట్టాలి. అర్థం కాలేదు కదా.. పదండి కాస్త లోతుగా వెళ్దాం.
తుపానులు రావడం అనేది చాలా సహజం. అదిగో ఆ సముద్రంలో తుపాన్ చెలరేగిందట. ఈ సముద్రంలో మరో తుపానట. అక్కడ ఇంకేదో తుపానట. ఇలా.. ఎక్కడ తుపాను వచ్చినా.. వాటి గురించి ప్రజలకు చెప్పాలన్నా.. మీడియాలో రాయాలన్నా… ఇలా.. అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంతే కదా.. ఎందుకంటే.. ఆ తుపానులకు ఓ పేరంటూ ఏదీ ఉండదు కాబట్టి. ప్రజలు కూడా గందరగోళానికి గురవుతారు. ఏ తుపాను గురించి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేరు. సేమ్ టు సేమ్ మనిషికి పేరుంటే ఎలా గుర్తింపు వస్తుందో అలా అన్నమాట. దీంతో తుపాన్లకు కూడా పేర్లు పెడితే బెటర్ అని పలు దేశాలు నిర్ణయించుకున్నాయి.
2004లో డబ్ల్యూఎమ్‌వో (ప్రపంచ వాతావరణ సంస్థ) ఆధ్వర్యంలో హిందూ, బంగాళాఖాతం, అరేబియా మహాసముద్ర తీరాల పరిధిలోని దేశాలన్నీ సమావేశమయ్యాయి. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలను పాల్గొని ఒక్కో దేశం 8 పేర్లను సూచించాయి. ఎనిమిది దేశాలు.. 8 పేర్లను సూచించాయన్నమాట. అంతే మొత్తం 64 పేర్లతో ఒక జాబితాను రూపొందించారు.
సో.. ఈ దేశాలను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం సెట్ చేశారు. బంగ్లాదేశ్ మొదటి స్థానంలోకి వచ్చింది. 2004లోనే అంటే ఈ దేశాలు పేర్లను సూచించిన తర్వాత అక్టోబర్‌లో హిందూ మహాసముద్రంలో వచ్చిన తుపానుకు బంగ్లాదేశ్ ఒనిల్ అనే పేరు పెట్టింది. ఎందుకంటే.. బంగ్లాదేశ్ పేరులోని మొదటి అక్షరం బి.. మిగితా దేశాల కన్నా ముందు కాబట్టి. ఆ తర్వాత వచ్చిన తుపాన్‌కు బంగ్లాదేశ్ తర్వాత లిస్టులో ఉన్న ఇండియా.. అగ్ని అని పేరు పెట్టింది. ఇలా.. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం.. ఒక్కో దేశం ఒక్కో పేరును పెడుతూ పోతుందన్నమాట. రాబోయే తుపాన్‌కు నామకరణం చేసే వంతు భారత్‌దే. అగ్ని అన్న పేరును ఇప్పటికే వాడేసింది కాబట్టి, పెట్టాల్సిన పేరు ‘ఆకాశ్’
ఏపీలోని వైజాగ్‌ను అతలాకుతలం చేసి హుద్‌హుద్ తుపాన్‌కు ఒమన్ పేరు పెట్టింది. తిత్లీకి పాకిస్తాన్ పేరు పెట్టింది. ఇప్పటికే ఆ దేశాలు సూచించిన 64 పేర్లలో 56 ఇప్పటికే వాడేశారు. పెథాయ్ తుపాను తెలుసు కదా. దానిది 56వ స్థానం. ఫొనిది 57 వ స్థానం. ఇంకో 7 తుపాన్ల పేరు అయిపోతే.. ఆ దేశాలన్నీ మళ్లీ సమావేశమై మరికొన్ని వేరే పేర్లను సూచించే అవకాశం ఉంది.
ఏ దేశం ఏ తుపాను పేర్లను సూచించిందంటే?
బంగ్లాదేశ్: ఒనిల్, ఒగ్ని, నిషా, గిరి, హెలెన్, చపల, ఓక్కీ, ఫొని
ఇండియా: అగ్ని, ఆకాశ్, బిజిలీ, జల్, లెహర్, మేఘ్, సాగర్, వాయు
మాల్దీవులు: హిబరు, గోను, ఆలియా, కీలా, మాది, రోను, మకును, హిక్కా
మయన్మార్: ప్యార్, యెమిన్, ప్యాన్, థానె, నానోక్, కయాంత్, దయే, కయాబ్
ఒమన్: బాజ్, సిదర్, వార్డ్, ముర్జాన్, హుద్ హుద్, నాడా, లుబాన్, మహా
పాకిస్తాన్: ఫనూస్, నర్గీస్, లైలా, నీలం, నీలోఫర్, వార్దా, తిత్లీ, బుల్‌బుల్
శ్రీలంక: మాలా, రష్మి, బంధు, మహాసేన్, ప్రియా, అసిరి, గజ, సోబా
థాయ్‌లాండ్: ముక్దా, ఖైముక్, ఫేట్, ఫైలిన్, కోమెన్, మోరా, పెథాయ్, ఆంఫాన్