ఓరి నాయనో ఇదేం విచిత్రం.. ఫెవిక్విక్‌తో కుట్లు వేసిన డాక్టర్.. ఎక్కడంటే?

-

ఎక్కడైనా గాయాలు తగిలి చర్మం చీలుకు పోతే కుట్లు వేసి గాయాన్ని మాన్పుతారు.. కానీ ఫెవిక్విక్‌తో కుట్లు వెయ్యడం ఎప్పుడైనా చూశారా?.. కనీసం విన్నారా? ఇలాంటి ఘటన ఒకటి తెలంగాణాలో వెలుగు చూసింది..ఓ వైద్యుడు చేసిన పనికి అంతా షాకవుతున్నారు. తల పగిలి ఆసుపత్రికి వస్తే.. ఫెవిక్విక్ తో అతికించేసి పంపించాడు. ఈ షాకింగ్ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజలో చోటుచేసుకుంది.

విషయానికొస్తే..కింద పడి గాయపడిన బాలుడిని తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్య సిబ్బంది కుట్లు వేయకుండా ఫెవిక్విక్‌తో అతికించి ఏం కాదంటూ పంపించేశారని బాలుడి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. కర్ణాటక రాయచూరు జిల్లా లింగసూగూరుకు చెందిన వంశీకృష్ణ, సునీత దంపతులు.. బంధువుల ఇంట్లో పెళ్లి నిమిత్తం అయిజకు వచ్చారు. ఈ క్రమంలో తన కొడుకు ప్రవీణ్‌ చౌదరి గురువారం రాత్రి పెళ్లి వేడుకలో ఆడుకుంటూ కిందపడ్డాడు. ఎడమ కంటి పైభాగంలో గాయం కావడంతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు..

గాయం పెద్దగా ఉన్నప్పటికీ కూడా వైద్య సిబ్బంది కుట్లు వేయకుండా అక్కడున్న ఫెవిక్విక్‌తో అతికించేసి పంపించారు. గమనించిన తండ్రి వంశీకృష్ణ ఆసుపత్రి వైద్యుడు నాగార్జునను ప్రశ్నించగా.. సిబ్బంది పొరపాటుగా చేశారని పేర్కొన్నారని వంశీకృష్ణ తెలిపారు. బాలుడికి ఏమీ కాదని, ఏమైనా జరిగితే తాను బాధ్యతవహిస్తానని చెప్పారన్నారు. ఆసుపత్రి నిర్లక్ష్యంపై బాధిత బాలుడి తండ్రి అయిజ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version