ఆటోడ్రైవర్లంటే సహజంగానే చాలా మందికి మంచి ఒపీనియన్ అస్సలు ఉండదు. వారు చార్జిలు ఎక్కువగా తీసుకుంటారని, అనవసరంగా దూషిస్తారని, మహిళలను వేధిస్తారని.. చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి అందరు ఆటోడ్రైవర్లు అలా కాదు. కొందరు మంచివారు కూడా ఉంటారు. ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా అలాంటి ఓ ఆటోడ్రైవర్ గురించే. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
బెంగళూరులోని కనకానగర్లో ఉన్న లిటిల్ ఏంజెల్స్ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న 15 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు బాలికలు ఫిబ్రవరి 11వ తేదీన స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్లకుండా తమతో తెచ్చుకున్న రూ.840తో లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబై వెళ్లారు. అక్కడ ఫిబ్రవరి 12వ తేదీన దిగారు. అదే రోజు సోను యాదవ్ అనే ఓ 28 ఏళ్ల ఆటో డ్రైవర్ వారిని ముంబైలోని ఓ ఫిలిం ప్రొడక్షన్ హౌస్‌కు తీసుకెళ్లాడు. అయితే వారి వద్ద ఫోన్లు లేకపోవడంతో వారు సోను యాదవ్ ఫోన్ నుంచి సదరు ప్రొడక్షన్ హౌస్‌లోని వారికి కాల్ చేశారు. ఈ క్రమంలో వారు తాము సినిమాల్లో నటించేందుకు వచ్చామని చెప్పగా, సదరు ప్రొడక్షన్ హౌస్ సిబ్బంది ఆ విద్యార్థినుల రెజ్యూమ్‌లు తీసుకుని కొంత సమయం గడిచాక మళ్లీ రావాలని చెప్పారు.
అయితే ఆ బాలికలకు ఏం చేయాలో తెలియలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ సోను యాదవ్ వారిని నిలదీసి అడగ్గా వారు అతనికి నిజం చెప్పారు. తాము సినిమాల్లో నటించేందుకు వచ్చామని తెలిపారు. దీంతో సోను యాదవ్ తన తోటి ఆటోడ్రైవర్ల సహాయంతో వారికి కొంత డబ్బు, దారిలో తినేందుకు ఆహారం, తిరుగు ప్రయాణానికి రైలు టిక్కెట్లు కొనిచ్చి దగ్గరుండి రైలు ఎక్కించాడు. మార్గ మధ్యలో ఏదైనా అవసరం అయితే తనకు ఫోన్ చేయాలని తన ఫోన్ నంబర్ కూడా ఆ బాలికలకు ఇచ్చాడు. సినిమాల్లో నటించాలనుకోవడం తప్పుకాదని, కాదని అందరూ మోసం చేసేవారు ఉంటారని వారికి సర్ది చెప్పి అతను వారిని తిరిగి రైల్లో ఇంటికి పంపించాడు. ఆ తరువాత వారు ఫిబ్రవరి 14వ తేదీన ఇంటికి వెళ్లాక తమ తల్లిదండ్రులచే సోను యాదవ్‌కు ఫోన్ చేయించి తాము సురక్షితంగా ఇంటికి వెళ్లామని చెప్పారు. దీంతో సోను యాదవ్‌ను ప్రస్తుతం అందరూ అభినందిస్తున్నారు. సినిమాల మోజులో పడి బాలికలు మోస పోకుండా కాపాడావని అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు..!