వాహ్‌.. ఏం ఆలోచ‌న గురూ… ఐకియా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించాలంటే అదే క‌రెక్ట్‌.!?

-

స్వీడిష్ ఫ‌ర్నిచ‌ర్ కంపెనీ ఐకియా దేశంలోనే తొలి స్టోర్‌ను హైద‌రాబాద్‌లో ప్రారంభించిన విష‌యం విదిత‌మే. తొలి రోజే ఊహించ‌ని రీతిలో క‌స్ట‌మ‌ర్లు ఎగ‌బడ్డారు. భారీ స్థాయిలో వినియోగ‌దారులు వ‌చ్చే స‌రికి ఐకియా స్టోర్ వారికి కూడా కొంత సేపు ఏం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రో వైపు బ‌య‌ట రోడ్ల‌పై భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఇక తొలి రోజు భారీ సంఖ్య‌లో కొనుగోళ్లు కూడా జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఐకియాకు అంత‌ర్జాతీయంగా మంచి గుర్తింపు ఉండ‌డం, దేశంలోనే తొలి స్టోర్ కావ‌డంతో భారీ స్థాయిలో స్పంద‌న వ‌చ్చింది. అయితే త‌మ‌కు కావ‌ల్సిన ఫ‌ర్నిచ‌ర్ వ‌స్తువు దొర‌క‌లేద‌నో లేదంటే మ‌రే ఇత‌ర కార‌ణం వ‌ల్ల‌నో చాలా మంది క‌స్ట‌మ‌ర్లు ఉత్త చేతుల్తో వెనుదిరిగార‌ట‌. అలాంటి వారిని ఆక‌ర్షించేందుకు మ‌రో ఫ‌ర్నిచ‌ర్ సంస్థ వినూత్న‌మైన ఆలోచ‌న చేసింది.

హోమ్ టౌన్ అనే ఫ‌ర్నిచ‌ర్ కంపెనీకి దేశ వ్యాప్తంగా 50కి పైగా స్టోర్స్ ఉన్నాయి. ఫ‌ర్నిచ‌ర్ రంగంలో మ‌న దేశంలోని టాప్ కంపెనీల్లో ఒక‌టిగా హోమ్ టౌన్ కొన‌సాగుతోంది. ఆ కంపెనీ స్టోర్స్‌ల‌లో ఫ‌ర్నిచ‌ర్ ఐట‌మ్స్ సేల్స్ కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. అయితే ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో ఐకియా స్టోర్ ఓపెనింగ్ సంద‌ర్భంగా హోమ్ టౌన్ కంపెనీ వినూత్న‌మైన ఆలోచ‌న‌తో న‌గ‌రంలో బోర్డుల‌ను పెట్టించింది. వాటిని చిత్రాల్లో మీరు గ‌మ‌నించ‌వ‌చ్చు.

చూశారు క‌దా.. ‘వారి దగ్గ‌ర లేనిది మా ద‌గ్గ‌ర ఉంది..’ అంటూ ప‌లు ర‌కాల యాడ్స్‌ను న‌గ‌ర వ్యాప్తంగా ఏర్పాటు చేసింది. ఆ యాడ్స్‌ల‌లో దేర్ అనే ప‌దం ఫాంట్‌, క‌ల‌ర్ అచ్చం ఐకియా లోగోను పోలి ఉండ‌డం విశేషం. అంటే.. దీన్ని బ‌ట్టి చూస్తే ప‌రోక్షంగా హోమ్ టౌన్ కంపెనీ ఐకియాపై పంచ్ వేసిన‌ట్లే క‌నిపిస్తోంది. అయితే ఇలా హోమ్ టౌన్ కంపెనీ యాడ్స్‌ను ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల చాలా మంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు, స‌ద‌రు యాడ్స్‌ను ఫొటోలు తీసి నెట్‌లో పెట్ట‌డంతో అవి కాస్తా వైర‌ల్ అయ్యాయి. కాగా ఆ ఫొటోల ప‌ట్ల నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ల‌ను కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఐకియా వ‌చ్చాక ఇత‌ర ఫ‌ర్నిచ‌ర్ కంపెనీల‌కు గ‌ట్టి పోటీ ఎదురైందనే చెప్ప‌వ‌చ్చు. మ‌రి ఆ పోటీని ఆ కంపెనీలు ఎదుర్కొంటాయా, లేదా అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version