వాట్ యాన్‌ ఐడియా సర్‌జీ.. పోలీసులు రూ.200 కన్నా ఎక్కువ డబ్బులు ఉంచుకోరాదట..!

-

ప్రజల నుంచి లంచాలు వసూలు చేసే ప్రభుత్య ఉద్యోగులు దాదాపుగా అన్ని శాఖల్లోనూ ఉంటారు. ఇక ముఖ్యంగా పోలీసు శాఖకు వస్తే ఆ ప్రభావం కొంత ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అయితే అందరూ అవినీతిపరులని అనలేం. కానీ కొందరు మాత్రం లంచావతారాలు ఉంటారు కదా. అలాంటి వారితో ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొనేందుకు హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఉనా అనే జిల్లా పోలీస్‌ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేమిటంటే…

హిమాచల్‌ ప్రదేశ్ లోని ఉనా జిల్లాకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. అది ఓ కొండ ప్రాంతం. అక్కడికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే ఆ ప్రాంతాల్లో అనేక చెక్‌ పాయింట్లు ఉంటాయి. ఆ పాయింట్లను దాటుకుంటూ పర్యాటకులు ముందుకు వెళ్లాలి. కానీ అక్కడ విధులు నిర్వహించే పోలీసులకు లంచాలు తడిపితే కానీ పర్యాటకులు ముందుకు వెళ్లలేరు.

ఈ మధ్యనే అలా లంచం తీసుకుంటూ కొందరు పోలీసులు ఉన్నతాధికారులకు చిక్కారు. దీంతో సమస్య తీవ్రత బాగా ఉందని తెలుసుకున్న జిల్లా పోలీసు శాఖ వినూత్న కార్యక్రమానికి పూనుకుంది. ఇకపై ఉనా జిల్లాలో ఉన్న చెక్‌ పాయింట్ల వద్ద విధులు నిర్వహించే పోలీసులు తమ వద్ద రూ.200 కన్నా ఎక్కువ మొత్తంలో సొమ్మును ఉంచుకోరాదు. అలా ఉంచుకుంటే వారిపై చర్యలు తీసుకుంటారు. ఒకవేళ అనుకోని పరిస్థితులలో రూ.200 కన్నా ఎక్కువ మొత్తాన్ని ఉంచుకోవల్సి వస్తే ముందుగా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి. కాగా ఉనా జిల్లాలో చెక్‌ పాయింట్ల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు లంచాలు బాగా తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆలోచనతోనే ఈ చర్యలు చేపట్టామని అక్కడి పోలీసు ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. ఏది ఏమైనా.. ఇలాంటి నిర్ణయమే దేశంలో అంతటా అమలు చేస్తే అప్పుడైనా లంచాలు తగ్గే అవకాశం ఉంటుంది కదా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version