కేంద్ర బడ్జెట్: పన్ను పరిమితి కాదు.. రిబేట్ పెంచారు.. అసలేంటి ఈ రిబేట్?

-

ఆదాయపు పన్ను కట్టే వాళ్లకు కేంద్ర బడ్జెట్ లో కొంత ఊరట లభించింది. అయితే.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నిన్న బడ్జెట్ లో ఆదాయపు పన్ను గురించి చేసిన ప్రకటన ఆదాయపు పన్ను కట్టే వారే కాదు.. అందరిలో కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేసింది. 5 లక్షల వరకు సంపాదించే వాళ్లు పన్ను కట్టాల్సిన అవసరం లేదన్నారు. కానీ.. అక్కడ పెంచింది ఆదాయపు పన్ను పరిమితిని కాదు… ఆదాయపు పన్ను రిబేట్ ను. అవును.. రిబేట్ ను పెంచారు. రిబేట్ అంటే.. పన్ను ఎంతైతే చెల్లించాలో దానిలో నుంచి ఇచ్చే రాయితీనే రిబేటు అంటారు. డిస్కౌంట్ అనుకోవచ్చు. శ్లాబు రేట్లు ఇదివరకు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. వాటిలో ఎటువంటి మార్పు లేదు.

ఇంకా క్లియర్ గా చెప్పుకోవాలంటే… ఇన్ కమ్ టాక్స్ లో మూడు రకాల పరిమితులు ఉంటాయి. ఒకటేమో 60 ఏళ్ల లోపు వాళ్లకు. వాళ్లు రెండున్నర లక్షల వరకు సంపాదిస్తే పన్ను కట్టాల్సిన పని లేదు. 60 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లు.. 3 లక్షల సంపాదన వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. 80 ఏళ్లు పైబడిన వాళ్లు 5 లక్షల వరకు సంపాదించినా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఇదివరకు ఉన్న శ్లాబు. ఈ శ్లాబును కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం మార్చలేదు. ఇవి ఇలాగే ఉన్నాయి. కాకపోతే.. ఇదివరకు మూడున్నర లక్షల లోపు సంపాదించే వాళ్లకు రిబేట్ సౌకర్యాన్ని కల్పించారు. సెక్షన్ 87ఏ ప్రకారం… 2500 రూపాయల రిబేట్ లభించేది. ఆ మూడున్నర లక్షలను ఇప్పుడు 5 లక్షలు చేశారు. దీంతో 12,500 రూపాయలు రిబేటు లభిస్తుంది.

అంటే.. మీ ఆదాయం 5 లక్షల లోపు ఉంటే… అప్పుడు 12500 రూపాయల రిబేటు వస్తుంది కాబట్టి మీరు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఆదాయం మినహాయింపులన్నీ కలిపితే 5 లక్షలు దాటితే… పన్ను శ్లాబులన్నీ యథాతథంగా ఉంటాయి. అంటే మీరు రెండున్నర లక్షల రూపాయల నుంచి పన్ను కట్టాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version