పాదరక్షల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా దూసుకుపోతుంది. భారతదేశంలో పాదరక్షలు తయారు చేసే కార్మికులు చాలా మంది ఉన్నప్పటికీ, ఇంకా మొదటి స్థానంలోకి రాలేకపోతుంది. దానికి గల ముఖ్య కారణాల్లో దిగుమతులు తగ్గకపోవడమే. పాదరక్షల ఉత్పత్తికి కావాల్సిన చాలా ముడిపదార్థాలను దిగుమతి చేసుకోవడం వల్ల రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ మేరకు ఎస్కార్ రాయల్ సీఈవో అబుంద్ శర్మ మాట్లాడిన దాని ప్రకారం..
కరోనా కారణంగా కుదేలైన చాలా రంగాల్లో పాదరక్షల తయారీ రంగం కూడా ఉంది. దీని కారణంగా ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. ఐతే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వోకల్ ఫర్ లోకల్ కారణంగా మన దేశంలో పాదరక్షల తయారీదారులు పెరిగే అవకాశం ఉంది. అలాగే అనేక మంది లోకల్ నిపుణులకి పని దొరుకుతుంది. అందువల్ల మునుపటి కంటే ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం దగ్గరలోనే ఉంది.
ముడిపదార్థాలని దిగుమతి చేసుకోవడం ఒకేసారి తగ్గించలేము. కొన్ని అవసరమైన వాటిని ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐతే కొన్ని సార్లు ఎలాంటి సుంకం లేకుండా నాణ్యత లేని ముడిపదార్థాలను దిగుమతి చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలా ఉండకుండా చేస్తే, దిగుమతులు తగ్గుతాయి. అలాగే ముడిపదార్థాల లభ్యత ఇక్కడే దొరికే వీలు కలిగించాలి. అదీగాక పెట్టుబడి పెట్టడానికి 50శాతం రాయితీ ఇవ్వాలి.
పాదరక్షల తయారీ సంస్థలకి మద్దతు కావాలి. లేబర్ గానీ, తయారీకి కావాల్సిన స్థలం గానీ, మొదలగు వాటికి ప్రభుత్వం సహకరించాలి. రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సహా అన్ని రంగాలకి కావాల్సిన సహాయ సహకారాలు దొరికితే మరికొద్ది రోజుల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ గా భారతదేశం ఎదగుతుంది.