వరల్డ్ కప్ మ్యాచుల్లో నారింజ రంగు జెర్సీ ధరించనున్న టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకో తెలుసా..?

-

సాధారణంగా ఏ టోర్నమెంట్‌లో అయినా సరే.. ఒకే రంగు జెర్సీలను కలిగిన జట్లు ఉంటే.. ఒకటి ఆ రంగు కాకుండా వేరే రంగు జెర్సీని ధరించాలి.

టీమిండియా అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మన జట్టు ఆటగాళ్లు ధరించే బ్లూ కలర్ జెర్సీనే. ఒకప్పుడు భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు పలు భిన్నమైన రంగుల జెర్సీలను వన్డే, టీ20 మ్యాచ్‌లకు ధరించినా.. ఆ జెర్సీల రంగు మాత్రం బ్లూ కలర్‌లోనే ఉండేది. కాకపోతే షేడ్స్ మారేవి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో కొన్ని మ్యాచుల్లో టీమిండియా ఆటగాళ్లు నారింజ రంగు జెర్సీలను ధరించనున్నారు.

సాధారణంగా ఏ టోర్నమెంట్‌లో అయినా సరే.. ఒకే రంగు జెర్సీలను కలిగిన జట్లు ఉంటే.. అవి ఆ రంగు కాకుండా వేరే రంగు జెర్సీలను ధరించాలి. వీటినే ‘అవే (AWAY) కిట్‌’ అని అంటారు. సాధారణంగా ధరించే జెర్నీని ‘హోమ్‌ కిట్‌’ అంటారు. అయితే టోర్నమెంట్లకు ఆతిథ్యం ఇచ్చే జట్లకు ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నమెంట్‌ ఇంగ్లండ్‌లోనే జరుగుతున్నందున ఇంగ్లండ్‌ తన హోమ్‌ కిట్‌తోనే ఆడుతుంది. ఇంగ్లండ్‌తో ఆడే ఇతర బ్లూ జట్లు మాత్రం ఆరోజు అవే కిట్‌తో ఆడాల్సిఉంటుంది.

ఇక మరో మూడు జట్లయిన భారత్, ఆఫ్గనిస్థాన్, శ్రీలంక జట్లు మాత్రం తాము టోర్నీలో సహజంగా ధరించే కలర్ జెర్సీలు కాకుండా మరొక కలర్ జెర్సీల వివరాలను కూడా ఇప్పటికే ఇచ్చారు. ఈ క్రమంలో ఈ మూడు జట్లు తమలోతాము ఆడే మ్యాచులతోపాటు అటు ఇంగ్లండ్‌తో ఆడే మ్యాచుల్లోనూ అవే(AWAY)కిట్లను ధరించాల్సి ఉంటుంది.

కాగా ఇండియా విషయానికి వస్తే.. భారత జట్టు ఆటగాళ్లు రెగ్యులర్‌గా బ్లూ కలర్ జెర్సీలను ధరిస్తారు కనుక వారు ఇంగ్లండ్, ఆఫ్గనిస్థాన్, శ్రీలంకలతో మ్యాచ్‌లు ఆడేటప్పుడు అవే(AWAY)కిట్లను ధరించాలి. కనుక ఇండియన్ ప్లేయర్లు ఆయా మ్యాచ్‌లలో ముందుగానే చెప్పినట్లుగా నారింజ రంగు జెర్సీలను ధరించనున్నారు. ఇక ఆఫ్గనిస్థాన్, శ్రీలంకలు కూడా ఇంగ్లండ్‌తో ఆడితే అవే(AWAY)కిట్లను ధరించాల్సి ఉంటుంది.

అయితే, ఈ మూడు దేశాలు తమలోతాము ఆడుతున్నప్పుడు ఎవరు హోమ్‌కిట్‌ ధరించాలి, ఎవరు అవేకిట్‌ ధరించాలన్నది ఐసీసీ నిర్ణయిస్తుంది. ఆ ప్రకారం నిన్న ఆఫ్ఘనిస్తాన్‌-శ్రీలంక మ్యాచ్‌లో శ్రీలంక హోమ్‌కిట్‌ వేసుకోగా, ఆఫ్ఘన్లు అవేకిట్‌ వేసుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్, ఇండియా, ఆఫ్గనిస్థాన్, శ్రీలంక జట్లు ఒకే కలర్ (బ్లూ) జెర్సీలను ధరిస్తుండడంతో ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో ఇలా వేర రంగు జెర్సీలను ధరించే రూల్ తెచ్చింది. అంటే.. ఇకపై భారత్ పైన చెప్పిన దేశాలతో వరల్డ్ కప్ మ్యాచులను ఆడితే నారింజ రంగు జెర్సీల్లో మనకు ప్లేయర్లు కనిపిస్తారన్నమాట. మరి ఆ కలర్ జెర్సీలు అభిమానులకు నచ్చుతాయో, లేదో వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version