మ‌హిళ‌ల సేఫ్టీకి పోలీసుల వినూత్న ఆలోచ‌న‌.. రాత్రి వేళ పోలీసులే లిఫ్ట్ ఇస్తారు..!

-

హైదరాబాద్ నగరంలో ఇటీవలే జరిగిన దిశ అత్యాచారం, హత్యోదంతంతో దేశవ్యాప్తంగా మరోసారి ప్రజాలోకం భగ్గుమంటున్న విషయం విదితమే. దేశవ్యాప్తంగా అందరూ ఆ అమానుష ఘటనను ఖండిస్తూ.. దోషులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మహిళల రక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అయితే ఈ విషయంలో లూథియానా పోలీసులు ఒక అడుగు ముందే ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే…

లూథియానా పోలీసులు మహిళలకు మరింత రక్షణ కల్పించే దిశగా ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇకపై అక్కడి మహిళలు రాత్రి పూట ఇంటికి వెళ్లేందుకు ఎలాంటి రవాణా సౌకర్యం వారికి అందుబాటులో లేకపోతే వారు అక్కడి పోలీసులు అందుబాటులో ఉంచిన పలు ఫోన్ నంబర్లకు కాల్ చేయవచ్చు. దీంతో పోలీసులు ఆ మహిళల వద్దకు వెళ్లి వారిని తమ పెట్రోలింగ్, ఇతర పోలీసు వాహనాల్లో వారు చేరాలనుకునే గమ్యస్థానంలో దింపి వెళతారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మహిళలకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని అక్కడి పోలీసులు తెలిపారు. అందుకు గాను మహిళలు 1091 లేదా 7837018555 లలో ఏదైనా నంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.

కాగా లూథియానా పోలీసులు కేవలం పైన చెప్పిన కార్యక్రమమే కాదు, ఇప్పటికే శక్తి యాప్ పేరిట మహిళల రక్షణ కోసం ఓ ప్రత్యేక యాప్‌ను నిర్వహిస్తున్నారు. దాన్ని మహిళలు తమ తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకుంటే, విపత్కర పరిస్థితుల్లో అందులో ఉండే ఎస్‌వోఎస్ ఫీచర్‌పై ఒకే ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు, సమీపంలో ఉండే పోలీస్ స్టేషన్‌కు ఆ మహిళల వివరాలు వెళ్తాయి. దీంతోపాటు ఆ మహిళకు చెందిన 10 సేవ్ అయిన కాంటాక్ట్‌లకు వారి లొకేషన్ వివరాలు వెళ్తాయి. దీంతో అందరూ అలర్ట్ అయి ఆ మహిళలను రక్షించేందుకు వీలు కలుగుతుంది. ఇక అక్కడ మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు మహిళలతో కూడిన ఓ కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. నిజంగా లూథియానా పోలీసులు మహిళల రక్షణ కోసం చేపట్టిన ఆ కార్యక్రమాలను అందరం అభినందించాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version