డబ్బంటే అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. అందరికీ ఇష్టం. వాస్తవానికి డబ్బంటే ఎవరకీ చేదు కాదు. ఆ డబ్బు సంపాదించడం కోసమే నానా కష్టాలు పడుతుంటారు. మన దగ్గర సరిపడా డబ్బుంటే.. నచ్చిన ఆహారాన్నీ, సౌకర్యవంతమైన ఇంటినీ మరియు ఆనంద జీవితాన్ని సంపాదించుకోగలుగుతాము. అందుకే డబ్బు కోసం ప్రజలు పాకులాడుతుంటారు. అయితే ఇప్పుడు అదే డబ్బు ప్రాణాలు తీస్తుందన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారు. కరోనా కరెన్సీ నోట్ల ద్వారా కూడా వ్యాపిస్తుందన్న సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల వైరస్ వ్యాప్తి చేస్తున్నామంటూ కొందరు కరెన్సీ నోట్లకు ఉమ్మిరాస్తూ, తమ ముఖానికి, ముక్కుకు రాసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ప్రజలకు మరింత భయం ఎక్కవ అయింది. ఈ క్రమంలోనే తాజాగా కరోనా దెబ్బకు కరెన్సీ నోట్లనే కాల్చేసారు ప్రజలు. కర్నాటక రాష్ట్రం కల్బుర్గి జిల్లా ఆళంద తాలూకా సుంటనురు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా రోడ్డుపై డబ్బులు కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు..? టక్కున తీసుకుని జేబులో తోసేస్తారు.
మరీ మంచోళ్లు అయితే ఆ డబ్బు ఎవరిదా అని కనుక్కుని వారికి చేరుస్తారు. అయితే సుంటనురు గ్రామంలో ముఖానికి మాస్క్ వేసుకొని వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాసేపు ఫోన్‌లో మాట్లాడి.. ఆ తరువాత నోట్లు పారవేసి వెళ్లినట్లు స్థానిక మహిళలు చెబుతున్నారు. అయితే వాటిని పిల్లలు ఎవరూ ముట్టకుండా ముందు మట్టితో కప్పేశారట. ఆ తరువాత గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో.. వారు వచ్చి నోట్లను ముట్టుకోకుండా కాల్చి బూడిద చేసేశారు.