మహిళలు తమ ఇంటి నుండి పనిచేయడం (వర్క్ ఫ్రం హోం) అనేది ఒక వరం. కానీ ఇది మహిళలకు అనేక సవాళ్లను తీసుకువస్తుంది. ఒకవైపు ఆఫీస్ పని, మరోవైపు ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు అన్ని సమన్వయం చేసుకోవడం కష్టంగా మారుతుంది. ఈ ఒత్తిడి మహిళల ఆరోగ్యం పై, పని సామర్థ్యం పై ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకుంటే వర్క్ ఫ్రేమ్ హోమ్ ను మరింత సులభంగా సమర్థవంతంగా మార్చుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన చిట్కాలు మీ రోజువారి పనులను సులభం చేసి ఒత్తిడి లేకుండా పనిచేసుకోవడానికి సహాయపడతాయి మరి అవి చూసేద్దాం..
నిర్దిష్ట పనివేళలు పాటించడం : వర్క్ ఫ్రమ్ హోమ్ లో పని వేళలు ఒక టైంకు ఉండవు. కానీ ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవడం చాలా ముఖ్యం. ఉదయం నిర్నిత సమయంలో పని మొదలుపెట్టి సాయంత్రం ఒక టైం కు ముగించడం అనేది చాలా ముఖ్యం. ఇలా చేస్తే కుటుంబ సభ్యులకు మీ పని షెడ్యూల్ పై ఒక స్పష్టత ఇచ్చినట్లు ఉంటుంది.
ఇంటి పనులను ప్లాన్ : మీకు వర్క్ ఉన్న టైంలో ఇంటి పనులను పూర్తిగా పక్కన పెట్టడం కష్టం కాబట్టి ఉదయం పని ప్రారంభించడానికి ముందే కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోవడం మంచిది. ఉదాహరణకు బ్రేక్ ఫాస్ట్ సిద్ధం చేయడం, మధ్యాహ్నం భోజనం కోసం ముందుగానే కూరగాయలు కట్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవడం వంటివి ఇది పని సమయంలో మీ ఏకాగ్రతను దెబ్బతీయకుండా, సహాయపడుతుంది.

చిన్నపాటి బ్రేక్లు తీసుకోవడం : నిరంతరం పనిచేయడం వల్ల అలసట ఒత్తిడి పెరుగుతాయి. ప్రతి గంటకు ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకోవడం వల్ల రిఫ్రెష్ అవుతారు. ఆ సమయంలో నిలబడడం, కొంచెం సేపు నడవడం, వేరే గదిలోనికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుని రావడం వంటివి చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల శారీరకంగా ఒత్తిడి తగ్గుతుంది.
ప్రత్యేకమైన ప్రదేశం: ఇంట్లోనే వర్క్ ఫ్రం హోం చేసే వారికి ఒక ప్లేస్ అనేది ఏర్పాటు చేసుకోకపోవడం నిజంగా మైనస్ అని చెప్పొచ్చు. ఇంట్లోనే పనిచేస్తున్నామని లాప్టాప్ ని చేతిలో పట్టుకొని ఎక్కడంటే అక్కడ కూర్చొని పని చేస్తూ ఉంటారు. అలాకాకుండా ఇంట్లోనే పనిచేయడానికి ఒక నిర్దిష్టమైన స్థలం కేటాయించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆఫీసు వాతావరణం ఇంట్లోనే లభిస్తుంది. అది గదిలో లేదా ఇంట్లో ఏదైనా సరే ఒక మూల అయినా మీ పని ప్రదేశం అని నిర్ధారించుకోండి. ఇది మీకు పని పై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.
మీ బాధ్యతలను పంచుకోవడం: కుటుంబంలో అందరూ సహకారం తీసుకోవడం వర్క్ ఫ్రం హోం చేసే మహిళలకు ఎంతో ముఖ్యం. మీ భాగస్వామితో, పిల్లలతో లేదా ఇతర కుటుంబ సభ్యులతో ఇంటి పనులను బాధ్యతలను పంచుకోవడం గురించి మాట్లాడండి. ఇంట్లో ఉన్న వారందరికీ పనులను కేటాయించండి ఇలా చేయడం వల్ల మీపై ఒత్తిడి తగ్గి సమయం ఆదా అవుతుంది.
గమనిక: ఈ చిట్కాలు ప్రతి ఒక్కరి వ్యక్తిగత పరిస్థితిని బట్టి మారవచ్చు వాటిని మీ జీవన శైలి అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం మంచిది.