పాటల చంద్రుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు..!

-

తెలుగు ఇండస్ట్రీ శోకసంద్రంతో నిండిపోయింది. తన కలం నుండి ఎన్నో అద్భుతమైన పాటల్ని రచించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కన్నుమూశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి 66 సంవత్సరాలు. తెలుగు పాటకి గౌరవం తీసుకువచ్చిన కవి ఈయన. అద్భుతమైన పదాలతో అమృతమైన తెలుగు భాషలో కొన్ని వందల పాటలు రచించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనడం బాధాకరం.

ఈయన నవంబర్ 24న ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆ రోజు నుండి ఐసీయూ లోనే ఉన్నారు. ప్రమాదం ఏమీ లేదని త్వరగా కోలుకుంటారు అన్నారు కానీ మంగళవారం మధ్యాహ్నం నుంచి ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించింది వైద్యులు కాపాడటానికి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి జననం, విద్యాభ్యాసం:

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి. ఈయన విశాఖ జిల్లా అనకాపల్లి లో జన్మించారు. సిరివెన్నెల గారి తండ్రి సివి యోగి వేదపండితులు. తల్లి అమ్మాజీ గృహిణి. ఈయనకు ఇద్దరు అక్కలు. ఇద్దరు సోదరులు. పాఠశాల విద్యను ఈయన అనకాపల్లిలోని మున్సిపల్ స్కూల్లో పూర్తి చేయడం జరిగింది. తరువాత ఆయన ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ లో చేరారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.

అనకాపల్లిలోని బిఎస్ఎన్ఎల్ శాఖలో ఉద్యోగంలో చేరారు. ఈయనకు చిన్నతనం నుండి దేశభక్తి గీతాలు రాయడం అలవాటు. అనేక కార్యక్రమాల్లో సైతం ఆయన సొంతంగా పాటలు రాసి ఆలపించేవారు. అలా సీతా రామ శాస్త్రి గారు కలం నుండి ఎన్నోపాటలని రచించారు.1983 లో కాకినాడలో జరిగిన ఒక కార్యక్రమంలో సీతారామశాస్త్రిగారు కె.విశ్వనాథుని కలిశారు.

ఆయనలో ఉండే ట్యాలెంట్ ని చూసి కె.విశ్వనాధ్ గారు అవకాశం ఇచ్చారు. ఇంకేముంది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి మంచి ప్లాట్ ఫామ్ దొరికింది. ఆ తరవాత నుండి ఎన్నో పాటలను ఆయన రాశారు. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో సిరివెన్నెల మూడు వేలకు పైగా పాటలు రాయడం జరిగింది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అందుకున్న అవార్డులు:

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మొత్తం ఆయన సినీ కెరీర్లో 11 నంది అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు పొందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version