భూమికి ఒకే ఒక చందమామ ఉందనేది పాత విషయం, తాజాగా మన భూమి కక్ష్యకు చేరువలో శాస్త్రవేత్తలు అర్జున 2025 PN7 అనే చిన్న గ్రహశకలాన్ని కనుగొన్నారు. దీనిని ‘క్వాసీ-మూన్’ అని పిలుస్తున్నారు. ఈ వింతైన ఖగోళ వస్తువు, మన నిజమైన చంద్రుడిలా భూమి చుట్టూ తిరగనప్పటికీ, దశాబ్దాలుగా మన గ్రహానికి ఓ రహస్య సహచరుడిగా ఉందన్న విషయం తెలిసి సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు. మరి ఆ చంద్రుడి గురించి తెలుసుకుందాం..
క్వాసీ-మూన్ ఎందుకు ప్రత్యేకమంటే?: ‘2025 PN7’ నిజానికి చంద్రుడు కాదు అది కేవలం 19 మీటర్ల (సుమారు 62 అడుగుల) వ్యాసం కలిగిన ఒక చిన్న ఆస్టెరాయిడ్. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది సూర్యుడి చుట్టూ భూమి తిరిగే సమయం (ఒక సంవత్సరం) లోనే తన కక్ష్యను పూర్తి చేస్తుంది. ఈ కారణంగా భూమి కోణం నుండి చూస్తే, ఈ గ్రహశకలం మన చుట్టూ ఒక ఉచ్చు (Looping) లాగా తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. అందుకే దీనిని ‘క్వాసీ-మూన్’ (పాక్షిక చంద్రుడు) అని పిలుస్తారు. మన నిజమైన చంద్రుడిలా కాకుండా దీని కక్ష్య భూమి గురుత్వాకర్షణ శక్తికి బంధీ కాదు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఈ గ్రహశకలం 1960ల నుంచే భూమికి దగ్గరగా ప్రయాణిస్తూ ఉంది మరియు 2080ల వరకు మనతో పాటే ప్రయాణం కొనసాగిస్తుందని భావిస్తున్నారు.

శాస్త్ర పరిశోధనల్లో దీని పాత్ర: అర్జున 2025 PN7’ ను అధ్యయనం చేయడం ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలకు అనేక విలువైన సమాచారం లభిస్తుంది. ముఖ్యంగా ‘నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్స్’ యొక్క కదలికలు వాటి కక్ష్య స్థిరత్వం మరియు గురుత్వాకర్షణ శక్తుల ప్రభావం గురించి మరింత లోతుగా తెలుసుకోవచ్చు. ఈ రకమైన క్వాసీ-మూన్స్ భూమిపైకి ఎటువంటి ప్రమాదాన్ని కలిగించవు కానీ సౌర వ్యవస్థ ఆరంభంలో ఏర్పడిన చిన్న శిథిలాల గురించి మరియు భూమి యొక్క అంతరిక్ష పరిసరాల గురించి అధ్యయనం చేయడానికి ఇవి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తాయి.
అర్జున 2025 PN7 ఆస్టెరాయిడ్ ఆవిష్కరణ మన భూమి ఒంటరిది కాదని మరోసారి రుజువు చేసింది. దశాబ్దాలుగా మన పక్కనే ఉన్న ఈ ‘క్వాసీ-మూన్’ ఖగోళశాస్త్ర అద్భుతం, అంతరిక్ష రహస్యాలను మరింత లోతుగా పరిశోధించడానికి కొత్త మార్గాలను తెరుస్తుంది.
