నెలలో ఒక్కసారే కదా అని తేలికగా తీసుకునే వారి కోసమే ఈ కథనం.. అప్పుడప్పుడు తీసుకునే ఆల్కహాల్ (Alcohol) కూడా మన శరీరంపై తక్షణ మరియు దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుంది. సోషల్ గ్యాదరింగ్స్‌లో,చిన్న పార్టీ లలో ఒకటో, రెండో డ్రింక్స్ తీసుకుంటే ఏమవుతుందిలే అనుకుంటారు. కానీ ఆ కాసేపు మత్తు వెనుక మీ మెదడు కాలేయం ఎంత కష్టపడతాయో తెలుసా? ఒక్క డ్రింక్‌తో మీ శరీరంపైన ఎలాంటి ప్రభావాలు పడతాయో తెలుసుకుందాం.
తక్షణ ప్రభావాలు: మెదడుపై మత్తు, మీరు ఆల్కహాల్ తీసుకున్న వెంటనే, అది నేరుగా రక్తంలో కలుస్తుంది. ఆ వెంటనే ఆ ప్రభావం మెదడుపై మొదలవుతుంది. ఆల్కహాల్ ఒక డిప్రెసెంట్ కాబట్టి అది మీ కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరును నెమ్మదిస్తుంది. దీనివల్ల మొదట్లో ఉల్లాసంగా, రిలాక్స్‌డ్‌గా అనిపించినా, కొద్దిసేపటికే ఆలోచనా శక్తి, సమన్వయం మరియు స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతాయి. రక్తంలో ఆల్కహాల్ గాఢత పెరిగే కొద్దీ ఈ ప్రభావాలు తీవ్రమవుతాయి. ఒక్కసారి తాగినా మత్తు పూర్తిగా తగ్గడానికి, మెదడు సాధారణ స్థితికి రావడానికి కొన్ని గంటల సమయం పడుతుంది.

దీర్ఘకాలిక ప్రభావాలు: నెలకోసారి తాగినా అది మీ కాలేయంపై ఒత్తిడిని పెంచుతుంది. కాలేయం ఆల్కహాల్‌ను ప్రాసెస్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది ఆల్కహాల్‌ను విచ్ఛిన్నం చేసి విషరహిత పదార్థాలుగా మారుస్తుంది. ఈ ప్రక్రియలో కాలేయం ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు తీసుకునే ఆల్కహాల్ వల్ల కాలేయానికి వెంటనే పెద్ద నష్టం జరగకపోయినా ఈ ఒత్తిడి పునరావృతమవుతుంది. అలాగే ఆల్కహాల్ కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. జీవక్రియ మరియు రక్తంలో చక్కెర స్థాయులపై కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. అతి తక్కువ మోతాదులో తాగినా, మీ నిద్ర నాణ్యత తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆల్కహాల్ అనేది ఒక రసాయన పదార్థం. అది ఎంత తక్కువగా తీసుకున్నా, శరీరం దాన్ని విషపదార్థంగానే పరిగణిస్తుంది. నెలలో ఒక్కసారి తాగడం వల్ల పెద్ద ఆరోగ్య సమస్యలు రాకపోవచ్చు. కానీ ప్రతిసారీ మీ మెదడు మరియు కాలేయం మాత్రం దాన్ని బయటకు పంపడానికి కష్టపడతాయి. కాబట్టి ఆల్కహాల్ వినియోగం విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా, పరిమితంగా ఉండటం ఉత్తమం.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, అతిగా ఆల్కహాల్ సేవించడం వల్ల కాలేయ వ్యాధులు, గుండె సమస్యలు మరియు క్యాన్సర్‌తో సహా అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి ఆల్కహాల్‌ను పూర్తిగా మానేయడం లేదా వైద్యులు సూచించిన మేరకు మాత్రమే తీసుకోవడం శ్రేయస్కరం.
